పాక్ లో వైమానిక దళంగా ఉగ్రసంస్థ
పాకిస్తాన్ సైన్యానికి పోటీగా ఆదేశానికే చెందిన ఉగ్రవాద సంస్థ తేహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) మరోసారి సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాదిలో ప్రత్యేక వైమానిక దళాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి పాక్ అధికారుల్లో కలకలం రేపింది. దేశ రక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీపీ శుక్రవారం వెల్లడించింది. అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి మద్దతు ఉందన్న అనుమానాల మధ్య టీటీపీ కొత్త ప్రణాళికలు రూపొందించుకుని తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.
పాకిస్తాన్ సైన్యానికి పోటీగా వైమానిక దళాన్ని ఏర్పాటు చేస్తామని సోషల్ మీడియాలో టీటీపీ పెడుతున్న పోస్టులు అధికారులను కలవరపెడుతున్నాయి. టీటీపీ వర్గాల కథనం ప్రకారం ఈ వైమానిక దళాన్ని సలీం హక్కానీ నేతృత్వంలో నడిపించనున్నారు. ప్రావిన్స్‌ల వారీగా మోహరింపులు చేపట్టడం, మిలిటరీ యూనిట్లను ఏర్పాటు చేయడం, అలాగే మిలిటరీ కమాండర్లతో కూడిన రెండు కొత్త పర్యవేక్షణ జోన్‌లను స్థాపించాలని టీటీపీ భావిస్తున్నట్లు వెల్లడైంది.
2026లో ఈ వైమానిక దళాన్ని ఏర్పాటు చేసి కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్ తో పాటు మరికొన్ని ప్రావిన్స్‌లను తమ ఆధీనంలోకి తీసుకోవాలని టీటీపీ వ్యూహరచన రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.
గతంలో 2022 నవంబరులో పాక్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని టీటీపీ ముగింపు పలికింది. ఆ తర్వాత నుంచి పాక్ భద్రతా దళాలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులపై వరుస దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్తాన్ ప్రావిన్స్‌లలో తన కార్యకలాపాలను విస్తరించింది. అఫ్గానిస్తాన్ భూభాగం నుంచే టీటీపీ ఉగ్రదాడులకు పాల్పడుతోందని పాక్ అధికారులు ఆరోపిస్తుండగా, తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది.

