తప్పయింది క్షమించండి
హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, ఆయన మంగళవారం బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆయన, మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని, అయితే ఆ క్రమంలో రెండు అసభ్య పదాలను వాడటం తప్పేనని అంగీకరించారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. తాను గ్రామ భాషలో మాట్లాడానని, అటువంటి పదజాలం వాడకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళలను సమాజంలో తక్కువగా చూపిస్తున్నారని, వారిని ఎవరూ తక్కువ చేయకూడదనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని శివాజీ వివరించారు. తాను మహిళలందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, హీరోయిన్లు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది వారికే మంచిదనే సూచన చేశానని స్పష్టం చేశారు. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని, కేవలం మంచిని చెప్పే ప్రయత్నంలో దొర్లిన పదాలకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు.

