ఇది ఆరంభం మాత్రమే
పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో సర్పంచ్ తొలి విడత ఎన్నికల ఫలితాలపై ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు . ఈ ఫలితాలు కేవలం ఆరంభం మాత్రమేనని,ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో పోరాడి గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు, గులాబీ సైనికులందరికీ ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన చోట్ల కనీసం 44 శాతం సీట్లను కూడా దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఫలితాలతో రుజువైందని, తెలంగాణలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టాయని అన్నారు. కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవకపోవడం, అనేక చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో బయటపడటాన్ని చూస్తే, కాంగ్రెస్కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టమవుతోందన్నారు. రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంట్ల పేరిట చేసిన మోసం, పెన్షన్ల పెంపు ద్రోహం, మహాలక్ష్మి దగా, తులం బంగారం నయవంచనను గ్రామీణ ప్రజలు మరిచిపోలేదని ఫలితాలు తేల్చిచెప్పాయన్నారు. యూరియా, బోనస్, పంటల కొనుగోలుపై రైతులు పడిన కష్టాలు, పదేళ్లు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో ప్రస్తుతం గాడితప్పిన పారిశుద్ధ్యం, ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలు పల్లె ప్రజలను ఆలోచింపజేశాయని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ వివరించారు.

