48 గంటల్లో 9 మంది ఆంధ్రా విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్ పరీక్షల్లో తప్పారని విద్యార్థుల ఆత్మహత్యలు
ఆత్మహత్యలు పరిష్కారం కాదంటున్న నిపుణులు
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్ బుధవారం ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షల ఫలితాలను ప్రకటించింది. పరీక్షల్లో తప్పారని తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 61% ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం 72% ఉత్తీర్ణత సాధించారు.

శ్రీకాకుళం జిల్లాలో 17 ఏళ్ల బాలుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని దండుగోపాలపురానికి చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి చాలా పేపర్లలో ఫెయిల్ కావడంతో నిరుత్సాహానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రినాధపురంలోని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లాకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు వదిలింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ ఐనందుకు కంచరపాలెంలో 18 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లిలోని 17 ఏళ్ల విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు 17 ఏళ్ల విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ బాలిక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోగా, అదే జిల్లాలో ఓ బాలుడు పులురుగుల మందు తాగి మృతి చెందాడు.

దేశ వ్యాప్తంగా విద్యా సంవత్సరంలో పరీక్షలు తప్పిన అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేస్తోంది. ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఆత్మహత్యలు చేసుకోవడంతో, విద్యా వ్యవస్థలో మార్పులను నిపుణులు సూచిస్తున్నారు. కేవలం జీవితానికి పరీక్షలు, పాసులు మాత్రమే కాదని.. ఇంకా చాలా ఉందన్నది అర్థమయ్యేలా చేయాలంటున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీలోని వివిధ క్యాంపస్‌లలో ఈ ఏడాది నలుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫిబ్రవరిలో విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతాలపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను చూస్తుంటే హృదయం ద్రవిస్తోందన్నారు. విద్యా సంస్థలు ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. విద్యార్థులు బలవన్మరణాలను చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు.

