84 ఏళ్లొచ్చేశాయ్.. ఇంకేం రాజకీయాలు చేయమంటారు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇకపై తాను ఏ రాజకీయపార్టీలో చేరబోనని తేల్చి చెప్పారు. ఇకపై తాను స్వతంత్రంగా వ్యవహరిస్తానన్నారు. 84 ఏళ్ల వయసులో చేయడానికి ఇంకేముంటుందన్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో.. పార్టీ పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీయేతర పార్టీల తరపున సిన్హా బరిలో నిలిచారు. తృణముల్ పార్టీతో ఇంకా టచ్ లోనే ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన ఘాటు రిప్లై ఇచ్చారు. ఇప్పటి వరకు తనతో ఎవరూ మాట్లాడలేదన్నారు… తనూ ఎవరితో మాట్లాడలేదన్నారు సిన్హా. వ్యక్తిగత వ్యవహారాలపై మాత్రమే తృణముల్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నానన్నారు. ప్రజాజీవితంలో 84 ఏళ్ల వయసులో చేయడానికి ఏముందన్నది చూడాల్సి ఉందన్నారు. సుదీర్ఘ కాలం బీజేపీలో ఉన్న యశ్వంత్ సిన్హా 2021 మార్చిలో.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో బీజేపీకి గుడ్ బై చెప్పారు.