Andhra PradeshNews

బీజేపీపై తప్పుడు ప్రచారం మానుకోండి

Share with

బీజేపీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ, టీడిపీలకు  ఎంపీ జవీఎల్ నరసింహారావు హితబోధ చేసారు.  ప్రత్యేక ప్యాకేజీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా అని ఈరోజు రాజ్యసభలో ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానంలో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి ఈప్యాకేజీని అంగీకరించారని, మే 2, 2017న లేఖ ద్వారా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారని కేంద్ర మంత్రి వెల్లడించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన వివిధ హామీలను, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అవసరాలను బాగా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015 మార్చి 15న ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏపీ) నిధులతో ప్రత్యేక సహాయచర్యను ప్రకటించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానంలో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం, 17 ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లపై రుణాన్ని అంటే  అసలు మొత్తం ఇంకా వడ్డీ రెండూ తిరిగి చెల్లించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా చెప్పారు. మరో రకంగాచెప్పాలంటే, ఈ 17 ప్రాజెక్టులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.

ప్రత్యేక ప్యాకేజీలో  చేర్చబడిన ఈ ప్రాజెక్టుల జాబితాలో విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్ట్ (రూ. 1859 కోట్లు), ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం కోసం ప్రాజెక్ట్ (935 కోట్లు), ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ (897 కోట్లు), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (825 కోట్లు) మొదలైనవి ముఖ్యమైన ప్రాజెక్టులు. ప్రత్యేక ప్యాకేజీలో 100% కేంద్రప్రభుత్వ నిధులతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమలు చేయడానికి కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ప్రత్యేకహోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ అమలులో ఉందన్నారు. 17 ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల కోసం ఇప్పటికే 7798 కోట్ల రూపాయిలు పంపిణీ అయ్యాయని తెలియజేసారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి వివరణతో వైసీపీ, టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు బట్టబయలయ్యాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.  నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలులో లేదని ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించాయని, పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానంతో ఈ అబద్ధాలు తేటతెల్లమయ్యాయని,ఇక ప్రజలు వారి మాటలు నమ్మరని అన్నారు ఎంపీ జీవీఎల్‌ .