Home Page SliderInternational

మక్కాలో మృతుల్లో 68 మంది భారతీయులు, ధ్రువీకరించిన సౌదీ

హజ్ యాత్ర సమయంలో అనారోగ్యం బారిన పడి ఇప్పటి వరకు 645 మంది మృత్యువాతపడినట్టు సౌదీ అధికారులు చెబుతున్నారు. 550 మరణాలు నమోదయ్యాయని ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలు మంగళవారం ప్రకటించిన తర్వాత ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటైన ముస్లింలందరూ కనీసం ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలన్న భావన ఉంటుంది. సౌదీ అరేబియాలోని ఒక దౌత్యవేత్త బుధవారం మాట్లాడుతూ, ఈ సంవత్సరం హజ్ తీర్థయాత్రలో 68 మంది భారతీయులు మరణించారని చెప్పారు. “మేము సుమారు 68 మంది మరణించినట్లు నిర్ధారించాం. కొన్ని సహజ కారణాలతోపాటుగా, వృద్ధ యాత్రికులు చనిపోయినవారిలో ఉన్నారు. మరికొందరు వాతావరణ పరిస్థితుల కారణంగా, చనిపోయారు.” అని తాజా పరిస్థితిపై సౌదీ అధికారి వెల్లడించారు.

మృతుల్లో 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్డానియన్లు ఉన్నట్టు అరబ్ దౌత్యవేత్తలు చెప్పారు. ఈజిప్షియన్లు “వేడి కారణంగా” మరణించారని తెలిపారు. మరణాలు ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్‌తోపాటుగా, స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతం ద్వారా కూడా నిర్ధారించబడ్డాయి. అయితే చాలా సందర్భాలలో అధికారులు కారణాన్ని పేర్కొనలేదు. AFP లెక్కల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 645 మంది మరణించారు. గత ఏడాది 200 మందికి పైగా యాత్రికులు మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వారిలో ఎక్కువ మంది ఇండోనేషియాకు చెందినవారు. సౌదీలో ఎండలు మండుతున్నాయని, భారీగా ఉష్ణోగ్రతలతోపాటుగా అనేక మంది మృత్యువాతపడే ప్రమాదముందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

అనారోగ్యం కారణంగా, ఎండ వేడిమి కారణంగా… చనిపోయిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎండ వేడిమికి కొందరు మృతి చెందినట్టు స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఏళ్లతరబడి సౌదీ అరేబియాలో వేసవి సమయంలో హజ్ యాత్ర కొనసాగుతోంది. గత నెలలో ప్రచురించబడిన సౌదీ అధ్యయనం ప్రకారం, ప్రార్థనలు నిర్వహించే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ (0.72 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతున్నాయి.