InternationalNews

50 కోట్ల వాట్సాప్‌ నెంబర్ల హ్యాక్‌..!

మీరు వాట్సాప్‌ నెంబరు వాడుతున్నారా..? అయితే.. మీ నెంబరు హ్యాక్‌ అయిందేమో చూసుకోండి. మీ వివరాలు తస్కరించబడ్డాయేమో.. మీ బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బులు ఖాళీ అయ్యాయేమో.. మీరు ఏదైనా స్కామ్‌లో చిక్కుకునే ప్రమాదమూ లేకపోలేదు. భారత్‌ సహా అమెరికా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌, జపాన్‌, ఈజిప్ట్‌, బల్గేరియా దేశాలకు చెందిన 50 కోట్ల మందికి పైగా వాట్సాప్‌ నెంబర్లను హ్యాకర్లు తస్కరించారు. ఆ నెంబర్లను ఏకంగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. అమెరికాకు చెందిన 3.2 కోట్ల, భారత్‌కు చెందిన 60 లక్షల వాట్సాప్‌ నెంబర్లు ఈ హ్యాకింగ్‌లో ఉన్నాయి.

రూ.5.72 లక్షలకు విక్రయానికి..

50 కోట్ల వాట్సాప్‌ నెంబర్లను 7 వేల డాలర్ల (రూ.5,72,000)కు విక్రయానికి పెట్టారు. ఏదో ఒక దేశానికి చెందిన నెంబర్లు కూడా విడిగా విక్రయిస్తారట. యూకేకు చెందిన వాట్సాప్‌ నెంబర్ల వివరాలు కావాలంటే 2,500 డాలర్లు (రూ.2,04,000) చెల్లించాలని హ్యాకర్‌ డిమాండ్‌ చేస్తున్నాడు. తాను డేటా తస్కరించానన్న దానికి రుజువుగా యూకేకు చెందిన 1,097 నెంబర్లను సాక్ష్యంగా చూపించాడు. ఈ డేటాను ఎలా తస్కరించాడనే విషయాన్ని హ్యాకర్‌ వెల్లడించలేదు.

లింక్‌ పంపించి క్లిక్‌ చేయమంటారు..

ఈ వాట్సాప్‌ నెంబరు అక్రమార్కుల చేతికి చిక్కితే.. ఆ నెంబరు సాయంతో ఆన్‌లైన్‌ నేరాలు, మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుండగుడు ఏదో ఓ లింక్‌ పంపించి.. దాన్ని క్లిక్‌ చేయమని అడుగుతాడు.. ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మన అకౌంట్‌లోని డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. లేదా ఏదో ఓ స్కామ్‌లో మనల్ని ఇరికించొచ్చు. లింక్‌లపై క్లిక్‌ చేయకపోవడమే దీనికి ఏకైక పరిష్కారమని నిపుణులు అంటున్నారు. వాట్సాప్‌, దాని మాతృ సంస్థ మెటా కూడా హ్యాకర్ల బారిన పడ్డాయి.