తెలంగాణాలో రాగల 48 గంటలు..వాతావరణ శాఖ అలర్ట్
ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు భారీ వర్షాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వర్షాలు విరామం లేకుండా అడపదడప కురుస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఈ వర్షాలకు సంబంధించి మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టం నుంచి 3.1కి.మీటర్లు ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలది దక్షిణ దిశ వైపుకి వంపుకు తిరిగి ఉందని పేర్కొంది. రాజస్థాన్ పరిసర ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్ ,తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌ఘడ్ వెంబడి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు క్రమంగా బలహీన పడినట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో రాగల 3 రోజుల్లో ఈ ద్రోణి తెలంగాణాను తాకే అవకాశం ఉన్నట్లు తెలిపింది.దీంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని గుర్తించిన వాతావరణ శాఖ రాష్ట్రానికి కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఈ క్రమంలో తెలంగాణా ప్రజలు తగు జాగ్రత్తలు లేకుండా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని తెలంగాణ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Read more:ప్రారంభమైన ఫిల్మ్‌ఛాంబర్ సమావేశం