ఒడిశా రైలు ప్రమాదంలో కరెంట్ షాక్‌తో 40 మంది మృతి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. కాగా ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దాదాపు 1100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చనిపోయిన వారిలో ఓ 40 మంది ఒంటిపై ఎటువంటి గాయాలు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఓవర్ హెడ్ కేబుల్ తెగి రైలుపై పడిందన్నారు. దీంతో ఈ 40 మంది కరెంట్ షాక్‌తో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే చనిపోయిన వారిలో ఇప్పటికీ 101 శవాల కోసం బంధువులు ఎవరు రాలేదని అధికారులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగి 5 రోజులు అవుతుండడంతో శవాలు కుళ్లిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో శవాలను గుర్తించేందుకు కూడా వీలుపడడం లేదన్నారు. మిగిలిన శవాల కోసం ఎవరు రాకపోతే వాటన్నింటిని సాముహికంగా దహనం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

