జాతీయ పతాకమే దేశ ప్రజల డీపీ
మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభసమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో ప్రజలందరూ మూడు రోజుల పాటు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని, ఆగస్టు 13 నుండి 15 వరకూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలనీ పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 2 నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు. దేశప్రజలందరూ ఆయనకు ఋణపడి ఉంటారనీ, మనమెంతో గర్వించే రీతిలో జాతీయ పతాక రూపకల్పన చేసారని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తన సోషల్ మీడియా ఖాతాల (DP) ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీపీలను మార్చానని… అందరూ కూడా త్రివర్ణ పతాకంతో కూడిన ప్రొఫైల్ ఫోటో డీపీగా మార్చుకోవాలని కోరారు. ఆయన కూడా తన డీపీ చేంజ్ చేసి ట్వీట్ చేసారు.
అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధాని బాటలో నడిచి, తమ ఖాతాల డీపీలను జెండా రంగులతో నింపేసారు. దేశ ప్రజలందరూ కూడా తమ దేశభక్తిని ప్రదర్శిస్తూ, ఆగస్టు 2-15 తేదీల మధ్య సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్… డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని అభ్యర్థించారు. అలాగే ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకున్నారు.