గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్.. గిరిజనబంధు
‘వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవోను అమలు చేస్తాం. ఆ జీవోను గౌరవించి అమలు చేయిస్తావా..? ఉరితాడు చేసుకుంటావా..?’ అని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ‘తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ’ను ఎన్టీయార్ స్టేడియంలో శనివారం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5-6 శాతం రిజర్వేషన్లే పొందారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని గుర్తు చేశారు. ఆ జీవో విడుదల చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను అడుగుతున్నానన్నారు. ఎన్‌పీఏ సాకుతో లక్షల కోట్ల రూపాయలు దోచి పెడుతున్న మోదీ సర్కారు పేద ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గిరిజన గురుకులాలు పెంచుతాం..
దళిత బంధు అమలు చేస్తున్నట్లే.. గిరిజన బంధు ద్వారా గిరిజనులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే తమ సిద్ధాంతమన్నారు. గిరిజన గురుకులాలను మరిన్ని పెంచుతామని, గిరిజన బాలికల గురుకులాలను ఈ ఏడాదే ప్రారంభిస్తామని ప్రకటించారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని మహారాష్ట్ర నాయకులు చెప్పారని తెలిపారు. దేశంలో రైతు రాజ్యం రావాలని, తెలంగాణాలో మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ పొలాల్లో నీళ్లు జలజలా పారాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్వేష రాజకీయాలను పారద్రోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీయార్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించారు.