NationalNews

18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు.. ఇదీ మోదీ టార్గెట్‌

18 నెలల్లో 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీని కోసం రోజ్‌గార్‌ మేళాను ప్రధాని ప్రారంభించారు. తొలి దశలో శనివారం 75,226 మంది యువతకు వర్చువల్‌ విధానంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మాట్లాడారు. 8 ఏళ్లలో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చామన్నారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో మేక్‌ ఇన్‌ ఇండియా మిషన్‌ పనిచేస్తోందని తెలిపారు. కొత్త ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, రైతులు ఈ మిషన్‌లో భాగస్వామ్యం కావాలని సూచించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ముద్రా యోజన కింద బ్యాంకుల ద్వారా రూ.20 లక్షల వరకు రుణం ఇస్తామన్నారు.

38 విభాగాల్లో ఉద్యోగాలు..

రక్షణ, రైల్వే, హోం, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ తదితర 38 రంగాల్లో గ్రూప్‌ ఏ, బీ, సీ విభాగాల్లో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కరోనా సమయంలోనూ సూక్ష్మ, మధ్య తరహా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుందని.. దీంతో దేశంలో స్టార్టప్‌ల సంఖ్య 80 వేలు దాటిందని ప్రధాని మోదీ తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి.. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరుకుందని ప్రధాని చెప్పారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ద్వారా గ్రామీణ యువతకు కూడా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.