తప్పిపోయిన ఆవుకోసం 10 లక్షల ఖర్చు-డిఎన్ఏ టెస్టు
వినడానికి వింతగా అనిపించినా తప్పిపోయిన ఆవు కోసం అష్టకష్టాలు పడ్డాడు రాజస్థాన్‌లోని దులారాం అనే ఆసామి. తన ఆవును దక్కించుకోవడానికి 10 లక్షలు ఖర్చు పెట్టడమే కాకుండా దానికి డీఎన్ఏ టెస్టు కూడా చేయించాడు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం తన ఆవు తప్పిపోవడంతో పోలీసులకు కంప్లైంటు ఇచ్చాడు. యధాప్రకారం మనుష్యులు తప్పిపోతేనే పట్టించుకోని పోలీసులు ఈ ఆవు గురించి పట్టించుకోలేదు. కానీ యథాశక్తి దానికోసం గాలిస్తూనే ఉన్నాడు దులారాం. కొన్నాళ్ల తర్వాత ఒక వ్యక్తి దులారాం ఆవును ఒక సంతలో చూసినట్లు చెప్పాడు. దీనితో పరుగున వెళ్లి తన ఆవును వారితో గొడవపడి మరీ తెచ్చుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. మర్నాడే కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేసి ఆ ఆవును తీసుకుపోయారు. దీనితో మళ్లీ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఈసారీ పోలీసులు పట్టించుకోలేదు. దీనితో ఎస్పీని, డీజీపీని కలిసి తన ఆవు గురించి చెప్పుకున్నాడు. వారు చెప్పడంతో పోలీసులు కొన్నాళ్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

చివరికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ వాహనాలకు అడ్డంపడి, ఎలక్ట్రిక్ పోల్‌పై ఎక్కి చనిపోతానని బెదిరించాడు. దీనితో దిగివచ్చిన పోలీస్ యంత్రాంగం చివరికి ఆవును కనిపెట్టారు. కానీ అది నా ఆవే అంటూ ఆ వ్యక్తి మొరాయించడంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఆవు తప్పిపోక ముందే దానికి రెండు దూడలున్నాయి. చివరికి వాటి డీఎన్ఏతో ఆవు డీఎన్ఏను పరీక్షించి, అది దులారాం ఆవే అని నిర్థారించారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారాలకు 10 లక్షలు ఖర్చు అయినా తప్పిపోయిన ఆవు తన వద్దకు వచ్చినందుకు సంబరపడిపోతున్నాడు దులారాం.

