Andhra PradeshHome Page Slider

మండ‌లి ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థులు ఏక‌గ్రీవం

9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5చోట్ల ఏకగ్రీవం

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఏకగ్రీవ విజయాలు నమోదు చేస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 5 స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించనున్నారు. వైయ‌స్ఆర్‌ , అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు.  

వైయ‌స్ఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవని తేలడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఇక్కడ  వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు స్క్రూటినీలో తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఎస్‌.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

నెల్లూరు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి మేరుగ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని తాను బలపరచలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని సూళ్లూరుపేట కౌన్సిలర్‌ చెంగమ్మ రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఇక్కడ మురళి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నిక లాంఛనం కానుంది. టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. బరిలో కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే మిగిలారు.