గీత దాటితే వేటే !
◆ ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్
◆ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు
◆ స్వయంగా రంగంలోకి దిగిన సీఎం జగన్
వైసీపీ నాయకులు పార్టీకి కట్టుబడి ఉండాలని పలుమార్లు సూచిస్తూ వస్తున్న అధినేత జగన్ గీత దాటిన వారిపై వేటు వేస్తూ నాయకులు ముఖ్యం కాదు పార్టీయే ఫైనల్ అని నిరూపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరిస్తూ ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి కి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని సమన్వయకర్తగా నియమిస్తూ ఆనంకు గట్టి షాక్ ఇచ్చారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

జగన్ తాజా నిర్ణయంతో ఆనం వర్గానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. వివిధ సంచలన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి మొదటి నుంచి సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆ విమర్శలు వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించేలా మారాయి. దీంతో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి ఆనం నోటికి కళ్లెం వేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే నేదురుమల్లికి కీలక పగ్గాలు అప్పగించారు. అంతటితో ఆగకుండా ఆనం రామనారాయణరెడ్డి హవాకు బ్రేక్ వేసేలా నియోజకవర్గంలో ఇక నుంచి అధికారులంతా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాటే వినేలా చేశారన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. దీంతో ఆనంకు షాక్ ఇచ్చినట్లైంది.

అధినేత జగన్ తో పాటు అదే జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లు కూడా తొలిసారిగా ఆనం రామా నారాయణరెడ్డిపై మాటల యుద్ధానికి దిగారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురు దాడి చేశారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో మొదటి నుండి నేదురుమల్లి, ఆనం కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు కోనసాగుతూనే ఉండేవి. గతంలో దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి నెల్లూరు జిల్లాలో ఆనం వర్గం, నేదురుమల్లికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం అదే వార్ కొనసాగింది. రెండు కుటుంబాలు వైసీపీలోకి వచ్చినప్పటికీ అదే వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గతం వారం రోజులుగా ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై గురిపెట్టారు. ప్రభుత్వంపై వరుస విమర్శల బాణాలు వదులుతూ వచ్చారు.

గత మూడు రోజుల క్రితం ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై గోతులను కూడా పూడ్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంగళవారం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమ పార్టీ ఇంటికి వెళ్ళటం ఖాయమంటూ సొంత పార్టీ పైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో అధినేత జగన్ ఆనం వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడంతో పాటు ఆయన నోటికి తాళం వేసే విధంగా వెంకటగిరి ఇన్చార్జి బాధ్యతలను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టారు. దీంతో ఆనం వర్గానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. దీంతో ఆనం వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.

