Home Page SliderNational

ఏపీలో వైసీపీ ఓటమి ఎంతో ఆశ్చర్యం కలిగించింది-కేటీఆర్

పేదలకు పెద్దఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటమిపాలవ్వడం ఆశ్చర్యం కలిగించిందని బీఆర్‌ఎస్ పార్టీ నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఏపీ ఫలితాలపై మాట్లాడుతూ 40 శాతం ఓట్లు సాధించిన వైసీపీ ఎలా ఓడిపోయిందో అర్థం కాలేదన్నారు. పవన్ కళ్యాణ్ కూటమితో కలిసి పోటీ చేయకపోతే ఫలితాలు వేరేలా ఉండేవన్నారు. ఈ ఎన్నికలలో షర్మిలను పావుగా వాడుకుని వదిలేశారని, అంతకు మించి ఆమె పాత్ర ఏదీ లేదన్నారు కేటీఆర్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఢిల్లీలో రాజ్యాంగ, న్యాయనిపుణులను సంప్రదించామని పేర్కొన్నారు. వారి సలహాలతో ఎన్నికల కమిషన్ వద్దకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్‌ఎస్ పార్టీ పేరుతో ఎన్నికలలో గెలుపొందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై మండిపడ్డారు కేటీఆర్. దేశంలో పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.