మహిళలు, యువతులు బీ అలర్ట్..
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగింది. అపరిచితులతో స్నేహం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా.. ఆ తర్వాత అంతులేని విషాదాన్ని నింపుతోంది. ఎదుటి వారి గురించి పూర్తిగా తెలియకుండా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం అనర్థాలకు దారి తీస్తుంది. అపరిచితుల స్నేహం, ప్రేమ ముసుగులో ఎందరో మహిళలు, యువతులు మోసపోతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. సోషల్ మీడియా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని నంబర్లతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసులు తెలిపారు. ‘‘మీ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం అయ్యే అవకాశముంది. ఏఐతో మీ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయవచ్చు. తెలిసిన స్నేహితులైనా సరే హద్దులు పాటించండి. ఎవరైనా బెదిరిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి’’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రాచకొండ పోలీసులు షేర్ చేశారు.

