పార్టీ నుంచి వెళ్లగొడతారా? రేవంత్ పై వెంకట్ రెడ్డి విసుర్లు
కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలో చాన్నాళ్ల నుంచి ఉన్నోళ్లందరినీ వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కొందరు కాంగ్రెస్ నేతలు వెధవ పనులు చేస్తున్నారని… మొత్తం వ్యవహారాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్దే తేల్చుకుంటానంటూ కుండబద్ధలుకొట్టారు. దాసోజు శ్రవణ్ పార్టీ ఎలా మారుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. శ్రవణ్ విషయంలో రేవంత్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉంటే.. మునుగోడులో మీటింగ్ పెట్టడమేంటని దుయ్యబట్టారు వెంకట్ రెడ్డి. హుజూరాబాద్ ఎన్నికలప్పుడు మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ మారేది ఉంటే… అందరికీ చెప్పే వెళ్తానని.. అందులో దాపరికం ఉండదన్నారు.