కాంగ్రెస్‌కు వెంకట్‌రెడ్డి వెన్నుపోటు తప్పదా?
మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆరాట పడుతున్న కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి వెన్నుపోటు తప్పదా? పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రానున్న ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉంచాలా? ప్రచారంలో వినియోగించుకోవాలా? అనే విషయంపై కాంగ్రెస్ నేతలు సందిగ్ధంలో ఉన్నారు. వెంకట్‌రెడ్డి సోదరుడికే అండగా నిలిచి ఉపఎన్నికలో బీజేపీని విజయతీరాలకు చేరుస్తారా? కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని ఓడించేందుకు కృషి చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలిచింది.
నమ్మని కాంగ్రెస్ నేతలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణిక్కం ఠాగూర్ సహా పార్టీ సీనియర్ నాయకులెవరూ వెంకట్‌రెడ్డిని నమ్మడం లేదు. అందుకే.. భువనగిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉన్నప్పటికీ మునుగోడులో పార్టీ వ్యూహం గురించి ఆయనకు తెలియనివ్వడం లేదు. వెంకట్‌రెడ్డి మాత్రం తనను పార్టీ నుంచి పంపించే కుట్ర జరుగుతోందని, మునుగోడు సభలకు తనను ఆహ్వానించడం లేదని రాష్ట్ర పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి దయాకర్ చండూరు సభలో తనను విమర్శించడంపై పెద్ద దుమారమే లేపారు. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెబితేనే మునుగోడు ప్రచారానికి వెళ్తానని భీష్మించారు. దీంతో ఓ మెట్టు దిగొచ్చిన రేవంత్‌రెడ్డి.. వెంకట్‌రెడ్డికి బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు.
అయినా.. వెనక్కి తగ్గని వెంకట్‌రెడ్డి.. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ ఉప ఎన్నికలో ఆ పార్టీకి తీరని నష్టం చేయాలని చూస్తున్నట్లు కనబడుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మునుగోడులో పార్టీ పరంగానూ, వ్యక్తిగతంగానూ మంచి పట్టుంది. వారిని పార్టీకి దూరం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే రేవంత్ క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. రేవంత్, వెంకట్‌రెడ్డిల్లో ఎవరిది పైచేయి అవుతుందో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.