NationalNewsNews Alert

మోదీ హ్యాట్రిక్ పక్కా… అన్నీ సర్వేలదీ ఒకటే మాట

Share with


మోదీ మానియా ప్రబలంగానే ఉంది. బీజేపీ గాలి ఉధృతంగానే వీస్తోంది. అదే ఊపు.. అదే జోరు. అక్కడక్కడ కొద్దిగా ఎదురు గాలి వీచినట్లు కనిపించినా అదేమీ మోదీ శక్తిని అడ్డుకునేంత ప్రభావవంతమైనది కాదని సర్వేలు తేల్చేస్తున్నాయి. ఇప్పటికీ దేశం మొత్తం ఆయననే కోరుకుంటోంది. ఆయన వెంటే ఉండాలనుకుంటోంది. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లోకల్స్ బీజేపీ శక్తిని కట్టడి చేయాలని చూసినా .. మళ్ళీ అమేయ శక్తిగా ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా టుడే, ఇండియా టీవీలు చేసిన సర్వేలను పరిశీలిస్తే మళ్ళీ ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు దేశ పాలనా పగ్గాలు చేపట్టిన బీజేపీ.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. హ్యాట్రిక్ సాధించేందుకు ఉరకలు పెడుతోంది. మరి సర్వేలు ఏం చెబుతున్నాయి ? రాష్ట్రాల వారీగా రానున్న ఎన్నికల్లో పరిస్ధితి ఎలా ఉండబోతోందో అన్నది ఓసారి చూద్దాం.


మోదీ మానియా ముందు విపక్షాలు నిలబడ్డం కష్టంగానే ఉంది. అందులోనూ కాంగ్రెస్ కు అది దుస్సాధ్యంగా మారింది. ఇప్పుడన్న పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీ సారధ్యంలోని ఎన్ డీఏ పక్షాలకు 286 స్ధానాలు ఖాయంగా వస్తాయని తేలుతోంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూపీఏకి 146 స్ధానాలు, ఇతరులు 11 స్ధానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే సర్వే చెబుతోంది. అయితే ఈనెల మొదటి వారంలో నిర్వహించిన సర్వేలో యూపీఏకి కేవలం 125 స్ధానాలు మాత్రమే వస్తాయని తేలినా.. ఆ తర్వాత బీహార్ లో యూపీఏ భాగస్వామ్య పక్షంగా జేడీయూలో చేరడంతో లెక్కలు మారాయి. ఈ కొత్త పొత్తులు యూపీఏకి కొద్దిగా కలిసి వచ్చే అంశంగా మారింది. 125 స్ధానాలకు అదనంగా 21 స్ధానాలు యూపిఏకి లభించనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే కేంద్రంలో అధికారం మాత్రం ఎన్.డీ.ఏ దేనని ఇండియా టుడే సర్వే తేల్చేసింది. దేశవ్యాప్తంగా మోదీయే మళ్ళీ ప్రధాని కావాలని 53 శాతం ప్రజలు కోరుకుంటుంటే.. రాహుల్ ని కోరుకుంటున్న వారి సంఖ్య కేవలం 9 శాతమే ఉంది. ఇక కేజ్రీవాల్ ప్రధాని కావాలని ఆశిస్తున్న వారి సంఖ్య 7 శాతంగా ఉంది. ఇండియా టీవి సర్వేలో కూడా 41 శాతం మంది ఎన్డీఏ పక్షానే నిలిచారు. యూపీఏని కోరుకుంటున్న వారు కేవలం 28 శాతం మంది ఉన్నారు. అంటే ఈ రెండు సర్వేలు ఎన్.డీ.ఏ కే తిరిగి అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని బల్లగుద్ది మరీ చేప్పేస్తున్నాయి.


మొత్తం 543 లోక్ సభా స్ధానాలకు గాను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 362 స్ధానాల్లో విజయభేరి మోగించి తిరిగి అధికారంలోకి వస్తాయని ఇండియా టీవీ లెక్కలు కట్టింది. యూపీఏ కేవలం 97 స్ధానాల్లో మాత్రం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిని బట్టి మోదీ మానియా ఏమాత్రం తగ్గలేదని అర్ధం అవుతోంది. ఇక రాష్ట్రాల వారీగా సర్వే వివరాలను పరిశీలిస్తే .. ఇండియా టీవీ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ మొత్తం 80 లోక్ సభా స్ధానాలు ఉంటే.. అందులో 76 స్ధానాలను ఎన్డీఏ పక్షాలు వశం చేసుకోబోతున్నాయి యూపీఏ పక్షాలు కేవలం రెండు స్ధానాలకే పరిమితం అవుతాయని తేల్చింది. ఇక బీహార్ లో మొత్తం 40 స్ధానాలకు గాను 35 నియోజకవర్గాల్లో ఎన్డీఏ విజయ కేతనం ఎగరేస్తే.. యూపీఏకి కేవలం 5 స్ధానాలే దక్కనున్నాయి. మొత్తం 48 నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో 37 ఎన్డీఏకి .. యూపీఏకి 11 స్ధానాలు మాత్రం లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టీవీ సర్వే తేల్చింది. గుజరాత్ లో 26కి 26 స్ధానాలూ ఎన్డీఏకే దక్కనున్నాయి. రాజస్తాన్ లో కూడా అదే పరిస్ధితి 25 స్ధానాలకు 25 ఎన్డీఏ ఖాతాలో పడనున్నాయని ఇండియా టీవీ లెక్కలు పేర్కొంటున్నాయి. మధ్య ప్రదేశ్ లో 29 స్ధానాలకు గాను 28 ఎన్డీఏ యూపీఏకి కేవలం ఒక్క స్ధానమే దక్కనుంది. హిమాచల్ ప్రదేశ్, గోవా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు సర్వేలో తేలింది. ఇక తమిళనాడులో 39 స్ధానాలకు గాను యూపీఏకి 38 స్ధానాలు లభించనుండగా.. కేవలం ఒక్క స్ధానంతోనే ఎన్డీఏ సరిపెట్టుకోవాల్సిన పరిస్ధితి. కేరళలో కూడా ఇదే పరిస్ధితి. ఇక్కడ ఉన్న 20 నియోజకవర్గాలు యూపీఏ ఖాతాలోకే వెళ్ళనున్నాయి. తెలంగాణలోని 17 స్ధానాల్లో 6 ఎన్డీఏకి లభిస్తాయని , కేవలం 2 మాత్రమే యూపీఏకి వస్తాయని , తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం తధ్యమని ఇండియా టీవీ సర్వే పేర్కొంది. ఏపీలో ఉన్న మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాల్లో అన్నీ స్ధానాలు వైసీపీకే దక్కనున్నాయి.


ఇండియా టుడే సర్వే కూడా దాదాపు ఇవే ఫలితాలను ప్రకటించింది. రాజస్తాన్, ఢిల్లీలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చగా.. బీహార్ లో మారిన రాజకీయ సమీకరణాల కారణంగా ఎన్డీఏకి 14, యూపీఏకి 26 స్ధానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మధ్య ప్రదేశ్ లో 26 ఎన్డీఏకి , కేవలం 3 మాత్రమే యూపీఏకి వస్తాయని లెక్కలు కట్టింది. ఇక ఏపీ, తమిళనాడు, కేరళలోని అన్ని స్ధానాలు యూపీకే లభించనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 42 స్ధానాలకు గాను 35 టీఎంసీకి, కేవలం ఏడింటిలో ఎన్డీఏ విజయం సాధిస్తాయని ఇండియా టుడే సర్వే పేర్కొంది. మహారాష్ట్రలో మొత్తం 28 నియోజకవర్గాలకు గాను 30 యూపీఏకే లభించనుండగా.. 18 మాత్రమే ఎన్డీఏ ఖాతాలో పడనున్నాయి. కర్నాటకలోని 28 నియోజకవర్గాలకు గాను 13 ఎన్డీఏకి, 13 యూపీSకి లభిస్తాయని తేలింది. ఈ సర్వేలన్నింటినీ పరిశీలిస్తే కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ సారధ్యంలో ఎన్డీఏ సర్కారే రాబోతోందన్న సంకేతాలను సర్వేలు ఇస్తున్నాయి. మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని తేల్చేస్తున్నాయి. నమో మంత్రమే దేశం ఇప్పటికీ పఠిస్తోందని వెల్లడవుతోంది. ఈ ఫలితాలు ఎంత వరకు నిజమో తేలే వరకు వేచి చూడక తప్పదు.