తీవ్ర కరువు కాటకాలతో ఐరోపా ఖండం విలవిల -నదుల్లో నీరు ఆవిరి
ఒకప్రక్క భారతదేశంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ వరదలతో ఊర్లను ముంచెత్తుతూ ఉంటే మరోప్రక్క యూరోప్ ఖండం కరువు కాటకాలతో విలవిలలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా నదులు ఎండిపోయి, వర్షాలు కురవక ప్రజలు అలమటించిపోతున్నారు. గత 500 ఏళ్లలో ఇంత కరువు పరిస్థితులను చూడడం ఇదే మొదటిసారంటున్నారు. పచ్చగా కళకళలాడే ఫ్రాన్స్ దేశంలోని బుర్గుండి అనే ప్రాంతంలో వర్షాలు లేక పచ్చిక అంతా పసుపు రంగులోకి మారిపోయింది. అక్కడి టిజ్ అనే నది ఎండిపోయి, చేపలను ఎండబెట్టారా అని భ్రమ కలిగించేలా నది అంతా నీరు లేక చనిపోయిన చేపలతో నిండిపోయింది. స్పెయిన్‌లో రిజర్వాయర్లన్నీ ఎండిపోయాయి. యూరోప్‌లో ప్రధాన నదులైన డాన్యూబ్, రైన్, ఇటలీలో పొడవైన The poe అనే నదుల్లో పూర్తిగా నదీజలాలు అడుగంటిపోయి యూరోప్ వ్యవసాయరంగంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడింది.
ఈ వేసవి అత్యంత వేడి, పొడి వాతావరణంతో కూడినదిగా రికార్డులకు ఎక్కనుంది. అందువల్ల దక్షిణ, మధ్య ఇంగ్లాండ్‌లో ప్రభుత్వం అధికారికంగా కరువును ప్రకటించింది. పశువులు, పక్షులకు పాపం తాగునీరు కూడా కరువయ్యింది. జలచరాలకు నీరు లేక ప్రాణాలకు ముప్పు వాటిల్లనుంది. గత మూడునెలలుగా వర్షాలు కురవక నీటివినియోగంపై ఆంక్షలు మొదలయ్యాయి. అడవులలో వేసవి ఎండలకు కార్చిచ్చులు సంభవిస్తున్నాయి.
రైతులు ఆవులకు, ఇతర పాడి జంతువులకు కొళాయిలతో నీటిని అందిస్తూ వాటిని కాపాడుకుంటున్నారు. రాబోయే రోజులలో RAIN నదిలో నీరు మరింతగా తగ్గిపోతే ఇక రవాణాకు ఇబ్బందులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే డాన్యూబ్ నదిలో పడవల రవాణా కోసం ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. వీటి ఫలితంగా దశాబ్దాల క్రితం మునిగిపోయిన పడవలు బయటపడుతున్నాయి. మొత్తం 47 శాతం ఐరోపా ఖండంలో కరువు వల్ల నీటిఎద్దడి ఏర్పడింది.
ప్రపంచ వాతావరణ వ్యవస్థలలో వచ్చిన మార్పుల కారణంగా సంభవించిన సుదీర్ఘ పొడి వాతావరణం కారణంగా ఇలాంటి కరువులు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్త పీటర్ హాఫ్ మన్ తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా భూవాతావరణం వేడెక్కకుండా మనందరం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భూమిపై జంతుజాలాలు, వృక్ష సంపదకు సమతుల్యం లోపించి అది మానవ మనుగడకే ప్రమాదంగా మారుతుంది.