పవన్ కల్యాణ్ మాటను కాపులు మన్నించి బీజేపీకి ఓటేస్తారా?
మూడోసారి విజయం సాధించి, తెలంగాణలో హ్యాట్రిక్ సీఎం కావాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ వర్గాన్ని, ఏ ఓటును వదులుకునేందుకు సిద్ధంగా లేరు. కాకుంటే నాడు కేసీఆర్, మాటను మన్నించి వర్గాలు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నట్టుగా కన్పిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న కాపు ఓటర్లు గత కొద్ది రోజులుగా తాము బీఆర్ఎస్ పార్టీకే జై కొడతామంటూ ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. కమ్మలు కాంగ్రెస్, కాపులు బీఆర్ఎస్.. ఇలా ఎవరి అవసరాలు, సందర్భాలను బట్టి వారు రాజకీయాలు చేస్తున్నారు. గ్రేట్ హైదరాబాద్‌లో ఉన్న కాపు సోదరులు, స్థానిక మున్నురుకాపు సోదరులతో కలిసి గులాబీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి పెద్ద చిక్కు వచ్చి పడింది. కమ్మ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో ఈసారి కాపు, కమ్మ యుద్ధం తప్పదా అన్నట్టుగా సీన్ కన్పిస్తోంది. కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు బండి రమేష్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాగా, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలమ. మొన్నటి వరకు తనకు విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్న మాధవరం ఇప్పుడు తనకు ఎవరి నుంచి ఎక్కువ ముప్పు వస్తుందోనన్న కంగారులో ఉన్నారు.

