బండి, ఈటల అరెస్ట్… ఎందుకంటే..!?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీపై, దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా… బీజేపీ నేతలతో చర్చలు ఫలించడంతో దీక్ష కొనసాగింది. దీక్ష విరమించి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళతానని సంజయ్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్క్ నుంచి టీఎస్పీఎస్సీకి బయలుదేరిన బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు వాహనంలో తరలించి అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

