InternationalNews

ఎవరీ రిషి సునక్… ఇండియాతో ఉన్న అనుబంధమేంటి?

Share with

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే… బ్రిటన్ ప్రధాని పీఠాన్ని భారత సంతతి వ్యక్తి అధిరోహించనున్నాడు. తొలి భార‌తీయ మూలాలు ఉన్న రిషి సునక్… యూకే పీఎంగా ఎన్నికయ్యేందుకు మెండుగా అవకాశాలున్నాయ్. తూర్పు ఆఫ్రికా నుండి వలస వచ్చిన భారతీయ తల్లిదండ్రులకు సౌతాంప్టన్, హంప్‌షైర్‎లో 12 మే 1980న రిషి సునక్ జన్మించారు. వాస్తవానికి రిషి సునక్ పూర్వీకులకు పంజాబ్ మూలాలున్నాయ్. రిషి సునక్… లింకన్ కాలేజ్, ఆక్స్‌ఫోర్డ్‎లో బీఏ చదివారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో యం.బి.ఎ. పూర్తి చేశారు. ఇన్ఫోసిస్ ఫౌండ‌ర్ ఎన్ఆర్ నారాయ‌ణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని రిషి సునక్ 2009 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కాలిఫోర్నియాలో చ‌దువుకున్నప్పుడు ఏర్పడిన ప‌రిచయం, వివాహానికి దారి తీసింది.

రిషి,అక్షితాకు ఇద్దరు కుమారైలు ఉన్నారు. రిషి సున‌క్‌ 2019 లో రిచ్‌మండ్ పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవ‌రిలో బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ప్రజలు, ఉద్యోగుల‌కు అండ‌గా ఉండేందుకు అనేక ప‌థ‌కాల‌ను రిషి ప్రక‌టించారు. ఆ స‌మ‌యంలో దేశమంతటా రిషి సునక్ పాపుల‌ర్ అయ్యారు. బ్రిట‌న్ ప్రజ‌ల్లో ఆద‌ర‌ణ పొందారు. నమ్మకమైన నాయకుడిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఐతే సొంత పార్టీ ప్రధానిపైనే రిషి సనక్ తిరుగుబాటు ప్రకటించారు. బోరిస్ ప్రభుత్వం… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని… అలాంటి ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండలేనని ఆయిన మంత్రి పదవికి రాజీనామా చేశారు.