InternationalNews

అల్ జవహరి ఎవరు? పెంచిపోషించిదెవరు?

Share with

అయ్‌మన్ అల్ జవహరి ….ప్రపంచానికి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు..కాని అల్‌ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ పక్కన ఎప్పుడూ కళ్లజోడు పెట్టుకుని ఫోటోల్లో కన్పించే అతడి ముఖం మాత్రం చాల మందికి పరిచయమే. 2011లో అగ్రరాజ్యం అమెరికాపై లాడెన్ జరిపిన భీకర దాడి వెనుక ఉన్నది అతడే. లాడెన్ మరణం తర్వాత అల్‌ఖైదా ఉనికిని కోల్పోకుండా కాపాడిందీ అతడే. కాబూల్‌లో రెండు రోజుల క్రితం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో జవహరీని మట్టుబెట్టినట్లు అమెరికా ప్రకటించింది. గత 21 ఏళ్లుగా అమెరికా కళ్లుగప్పి తిరుగుతున్న ఆ భయనక ఉగ్రవాది ఎట్టకేలకు హతమయ్యాడు. అమెరికా FBI మోస్ట్ వాంటెడ్ లిస్టులో బిన్ లాడెన్ తర్వాత రెండో స్థానంలో జవహరీ ఉన్నాడు. జవహరీ తలపై 25 మిలియన్ల డాలర్ల నజరానా కూడా ఉంది.

ఈజిప్టు రాజధాని కైరోలో 19 జూన్ 1951లో అల్ జవహరీ జన్మించారు. డాక్టర్లు, స్కాలర్లు ఉన్న మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడతను. తాత రబియా అల్ జవహరీ .. సున్నీ ఇస్లామిక్ వర్సిటీలో ఇమామ్‌గా చేశారు. స్కూల్ దశలో ఇస్లామిక్ రాజకీయవేత్తగా మారారు. ముస్లిం బ్రదర్‌వుడ్‌లో సభ్యత్వం తీసుకోవడం వల్ల 15 ఏళ్లకే అరెస్టు అయ్యాడు.కైరో మెడికల్ స్కూల్ వర్సిటీలో మెడిసన్ చదివాడు. 1974లో గ్రాడ్యుయేషన్‌, ఆ తర్వాత నాలుగేళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి మొహమ్మద్ ఫార్మకాలజీ ప్రొఫెసర్‌. జవహరీ అల్‌ఖయిదా రిక్రూట్మెంట్‌లో కీలక పాత్ర పోషించాడు. విప్లవ భావాలతో ముస్లిం లోకాన్ని అల్‌ఖైయిదా వైపు మళ్లించాడు. తన వీడియో సందేశాలతో ముస్లిం యువతను ఆకట్టుకున్నాడు.

తొలుత కైరోలో మెడికల్ క్లినిక్ స్టార్ట్ చేసిన జవహరీ ఆ తర్వాత రాడికల్ ఇస్లామిక్ గ్రూపు వైపు ఆకర్షితుడయ్యాడు. 1981లో అధ్యక్షుడు అన్వర్ సాదత్ హత్య సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదుల్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో జవహరీ ఓ నేతగా ఎదిగాడు. ఇస్లామిక్ స్టేట్‌, ఇస్లామిక్ సొసైటీ స్థాపనకు కట్టుబడి ఉన్నట్లు అతను కోర్టుకు కూడా తెలిపాడు. అధ్యక్షుడు సాదత్ హత్య కేసు నుంచి అల్ జవహరీ బయటపడ్డా.. అక్రమ రీతిలో ఆయుధాలు కలిగిన కేసులో అతను మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 1985లో జైలు నుంచి రిలీజైన జవహరి ఆ తర్వాత సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆ తర్వాత పాకిస్థాన్ చేరుకున్నాడు. మళ్లీ అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాడు.

1990 దశకంలో ఆశ్రయం, నిధుల కోసం జవహరీ ప్రపంచ టూర్ చేసినట్లు భావిస్తున్నారు.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్ వైదొలిగిన సమయంలో అతను అనేక దేశాలకు వెళ్లాడు. 1993లో ఈజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్‌కు మళ్లీ నాయకత్వం వహించాడు. ఎన్నో దాడులకు రూపకల్పన చేశాడు. ఇస్లామిక్ స్టేట్ స్థాపన లక్ష్యంతో వేలాది మంది ఈజిప్టియన్లను ఊచకోత కోశారు. 1996లో సరైన వీసా లేని కేసులో చెచాన్యాలో అతన్ని రష్యా అరెస్టు చేసింది. 1997లో ఆఫ్ఘన్‌లోని జలాలాబాద్‌కు వెళ్లాడు. అక్కడే ఒసామా బిన్ లాడెన్‌తో బేస్ ఏర్పాటుచేసుకున్నాడు.

ఈజిప్ట్ ఇస్లామిక్ జిమాద్‌తో పాటు మరో అయిదు ర్యాడికల్ ఇస్లామిక్ సంఘాలు, బిన్ లాడెన్ ఆల్ ఖయిదా ఒక్కటయ్యాయి. యూదులు, క్రుసేడర్లకు వ్యతిరేకంగా వరల్డ్ ఇస్లామిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసారు. అమెరికా పౌరుల్ని చంపాలని ఆ ఫ్రంట్ ఓ ఫత్వా జారీ చేసింది. ఈ ఫ్రంట్ ఆధ్వర్యంలో కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యలయాలపై భీకర దాడులు జరిపి 228 మందిని పొట్టనబెట్టుకున్నారు. 2001లో ఏకంగా అమెరికా డబ్ల్యూటీసీ ట్విన్ టవర్స్‌ను విమానాలతో పేల్చేసిన ప్లాన్ వేసింది కూడా జవహరీనే. 2005లో లండన్‌లో ఉగ్రదాడి జరిపి 52 మందిని చంపేశాడు. ఆఫ్ఘనిస్తాన్ కాలమానం ప్రకారం జూలై 31న ఉదయం 6.18 నిమిషాలకు బైడెన్ ఆదేశాలతో అల్ జవహరీని మిస్సైల్ దాడితో చంపేశారు.