NewsTelangana

తెలంగాణాలో టీఆర్ఎస్ అంతమే లక్ష్యం- ఈటల రాజేందర్

Share with

తెలంగాణాలో ప్రస్తుతం రాజరిక పాలన నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్‌లోని చాలా మంది మంత్రులు తెలంగాణా రాష్ట్రం వద్దన్నవాళ్లేనని సంచలన వ్యాఖ్యలు చేసారు రాజేందర్. యాదగిరిగుట్టలో బండి సంజయ్  బీజేపీ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల మాట్లాడారు. తెలంగాణాలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్లు ప్రభుత్వ తీరు ఉందని ఆయన విమర్శించారు. తన కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా ఉందని రాష్ట్రంలో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రగతిభవన్‌లో కానీ, ఫామ్‌హౌస్‌లో కానీ ఉంటున్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని… ఫారెస్టు భూముల పేరుతో గిరిజనుల భూములు తీసుకుంటున్నారనీ మండిపడ్డారు.

కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పాలని కలలు కంటున్నారని… బీజేపీపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని… ఉన్న సీఎం పదవి కూడా ఊడేలా ఉందని పేర్కొన్నారు. ఈ 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదనీ…. అలాగే కేసీఆర్ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాలేదని అన్నారు. మోదీతో కేసీఆర్ సరితూగలేడన్నారు. ఇన్నేళ్లలో సాధారణ ప్రజలకి సీఎంను కలిసే అవకాశమే లభించలేదన్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తామని ఉబలాటపడుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటైన యూపీలోనే 2 సీట్లు వచ్చాయన్నారు. ఇక తెలంగాణాలో అధికారం కలేనన్నారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి తయారుగా ఉన్నారన్నారు. తెలంగాణాలో బీజేపీ,  టీఆర్ఎస్‌కి  ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందన్నారు.