NationalNews

మమతా బెనర్జీ దారెటు?

Share with

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దారెటు? ఆమె బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో స్నేహం చేస్తారా? కాంగ్రెస్‌, ఇతర విపక్షలతో జట్టు కడతారా? నిజానికి మమత నిర్ధిష్టమైన వైఖరితో లేనట్లు కనబడుతోంది. అవకాశాన్ని బట్టి రూటు మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా విపక్షాలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మమత మద్దతు పలికారు. దాని తర్వాత కొన్ని రోజులకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసిన బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌కు ఓటేశారు. అంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో విపక్షాలతో గొంతు కలిపిన మమత.. మరికొన్ని సందర్భాల్లో మోదీ సర్కారుకు అండగా నిలిచారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలోనూ ఉదయం పాల్గొన్న మమత మధ్యాహ్నం సమావేశానికి దూరమయ్యారు.

ఈ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు బహిష్కరించారు. మమత మాత్రం రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం తన విధానాలను రూద్ద కూడదని ఈ సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల డిమాండ్లను తీవ్రంగా పరిగణించాలని 15 నిమిషాల తన ప్రసంగంలో కేంద్రాన్ని కోరారు. అదే సందర్భంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై బెంగాల్‌కు మరింత మంది ఐఏఎస్‌లను కేటాయించాలని కోరారు. దేశంలో గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని, గవర్నర్‌ నిర్వహించే బాధ్యతలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించాలని బెంగాల్‌ మంత్రి సోవన్‌దేవ్‌ చటోపాధ్యాయ్‌ డిమాండ్‌ చేశారు. దీన్ని బట్టి మోదీ సర్కారుతో మమత మధ్యే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది.


అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టిపోటీ


నిజానికి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ నుంచి మమతకు గట్టి పోటీ ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్‌లో విస్తృత ప్రచారం చేశారు. టీఎంసీలో కీలక నేత సువేందు అధికారిని బీజేపీలో చేర్చుకొని.. ఓ దశలో రాష్ట్రంలో టీఎంసీని ఓడించి కాషాయ పార్టీ అధికారం చేపడుతుందన్న వాతావరణాన్ని కల్పించింది. మమతా బెనర్జీని నందిగ్రామ్‌లో సువేందు అధికారి ఓడించారు కూడా. అయితే, మమత ఎక్కడా తగ్గకుండా బీజేపీని దీటుగా ఎదుర్కొన్నారు. ఫలితంగా 2016 ఎన్నికల కంటే రెండు సీట్లు ఎక్కువగా 213 స్థానాల్లో విజయం సాధించి మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టారు. బీజేపీ మాత్రం 3 సీట్ల నుంచి 77 సీట్లకు ఎగబాకి ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ రెండు పార్టీల హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్‌, సీపీఎం నలిగిపోయాయి. ఈ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా లభించ లేదు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి బీజేపీతో పోరాటం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ టీఎంసీ ప్రతిష్ఠను దిగజార్చడమే లక్ష్యంగా బెంగాల్‌ మంత్రులపై మోదీ సర్కారు ఈడీని ప్రయోగిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన నేరంలో బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అదుపులోకి తీసుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 18 ఎంపీలను గెలుచుకున్న బీజేపీ.. రెండేళ్లలో జరిగే సాధారణ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రాంతీయ పార్టీగా బీజేపీకి ఎదురీదితేనే రాష్ట్ర ప్రజలు తనపై విశ్వాసం కొనసాగిస్తారని.. లేకుంటే బెంగాల్‌ ప్రజలు ఏకపక్షంగా బీజేపీ వైపు వెళ్తారని మమత భయపడుతున్నారు. మొత్తానికి ఒకానొక దశలో ఎర్రజెండాకు జై అన్న బెంగాల్‌లో కాషాయ జెండాను పాతేందుకు మోదీ-షా ద్వయం పకడ్బందీ వ్యూహాలు రచిస్తూనే ఉంది.