NationalNews

ఒకప్పుడు స్వీపర్‌… ఇప్పుడు అదే బ్యాంక్‌ ఏజీఎం..!

Share with

పట్టుదల, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది పూణేకు చెందిన ప్రతీక్ష టోండ్‌వాల్కర్‌. ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వీపర్‌ నుంచి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు ప్రతీక్ష. ప్రస్తుతం ఆమె అదే బ్యాంక్‌లో  అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. 1964లో పూణేలోని నిరుపేద కుటుంబంలో జన్మించారు. 17 సం.రాల వయస్సులో 1981లోనే సదాశివ్‌ కడుతో వివాహం జరిగింది. ఇంట్లో పరిస్థితుల కారణంగా 7వ తరగతి వరకు చదివారు.

ఆమె భర్త కడు ముంబైలోని ఎస్‌బీఐలో బుక్‌ బైండర్‌గా ఉద్యోగం చేస్తుండేవారు. 1984లో ఆమె భర్త మరణించడంతో ఆమె ఒంటరిగా జీవితాన్ని గడిపారు.  పరిస్థితులకు భయపడకుండా తన భర్త పనిచేస్తున్న ఎస్‌బీఐ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించారు. 10వ తరగతిలో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యారు. ఆ తర్వాత బ్యాంకులో మెసెంజర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేస్తూనే తన విద్యను కొనసాగిస్తూ ఎస్‌ఎన్‌డిటి కాలేజ్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఆమెకు బ్యాంకులోనే గుమస్తాగా నియమించారు. 2004లో ట్రైనీ ఆఫీసర్‌గా ఎదిగి వృత్తిపరంగా ఎంతో ఎదిగారు. ఆయన ప్రోత్సాహంతో బ్యాంకు ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌ రాసి.. ట్రైనీ అధికారిగా పదోన్నతి పొందారు. నిబద్ధత, నిజాయితీ, పరిశ్రమతో ప్రత్యేక గుర్తింపును సాధించారు. అంచెలంచెలుగా ఎదిగి… అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరారు.

మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే..  ఆమె తన కుటుంబ భాద్యతలను కూడా ధీటుగా నిర్వర్తించారు. ప్రతీక్షకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వినాయక్‌ ఇంజనీరింగ్‌ బ్యాచిలర్‌ పూర్తి చేసిన తరువాత ఐఐటీ పోవై నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చదివారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుమార్తె దీఓ బేకర్‌, మరో కుమారుడు ఆర్య ప్రస్తుతం చదువుతున్నారు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ.. పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రతీక్ష. ప్రస్తుతం ఆమె బాంద్రా బ్రాంచ్‌ ఎస్‌బీఐలో విధులు నిర్వర్తిస్తోంది… కొద్ది నెలల్లోనే పదవీ విరమణ చేసిన తర్వాత ప్రకృతి వైద్యంలో కెరీర్‌ని ప్రారంభిస్తానని ఆమె తెలిపారు. జీవితంలో పట్టుదల, కష్టపడితే అనుకున్నది సాధించవచ్చునేది ప్రతీక్ష జీవిత ప్రయాణం మనందరికీ పాఠాన్ని నేర్పుతుంది.