NewsTelangana

వెంకట్ రెడ్డి కిమ్ కర్తవ్యం…

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చుట్టూ కాంగ్రెస్ హైకమాండ్ ఉచ్చు బిగుస్తోంది. నిర్మోహమాటంగా మాట్లాడటం… నిజాయితీకి మారుపేరుగా పేరుగాంచిన వెంకట్ రెడ్డి రాజకీయంగా ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏం చేస్తే ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. రాజకీయంగా జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉండలేరు… అలాగని తమ్ముడు దారి చూపిస్తున్న బీజేపీలోకి వెళ్లలేక ఆయన సతమతమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగిన కోమటిరెడ్డి నాడు వైఎస్ ముఖ్య అనుచరుడిగా జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన మాటంటే వేదంలా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు భావించేవారు. జిల్లాలో ఉద్దండులున్నప్పటికీ కోమటిరెడ్డికి ప్రాధాన్యత కూడా ఎక్కువే. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. ఏ రోజు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఊహించడానికి కష్టంగా ఉంటుంది.

ఇలాంటి తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండంచల వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా కల్లోలంలో ఉన్న హస్తం.. తెలంగాణ విషయంలోనూ ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత భగ్గుమన్న అసంతృప్తులు ప్రస్తుతానికి లావాలా స్తబ్దుగా ఉన్నా.. అవి ఏ రోజు పెల్లుబీకుతాయో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఎత్తుపల్లాలు చూశారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే భువనగిరి ఎంపీగా అవకాశం దక్కడం… గెలవడం చకచకా జరిగిపోయాయ్. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ వ్యవహరించిన తీరు ఉద్యమకారుల గుండెల్లో చోటు దక్కేలా చేశాయ్. కానీ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి అనూహ్యంగా ఓటమిపాలైనా… ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించి రాజగోపాల్ రెడ్డి సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకోవడం… పార్టీకి నమ్మకమైన నేతలు ఎవరూ లేకుండా పోయారన్న వర్షన్ బలంగా విన్పించింది.

పార్టీకి బలమైన నేత అవసరమని… అది తన రూపంలో అడ్వాంటేజ్ కలిగిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోని హస్తం పెద్దలకు అనేకసార్లు వివరించాడు కూడా. పీసీసీ చీఫ్ ఇస్తే పార్టీని నిలబెడతానంటూ ఢిల్లీ పెద్దలకు ప్రజంటేషన్లు సైతం ఇచ్చారు. కానీ కట్ చేస్తే… ఇతర పార్టీలోంచి వచ్చిన రేవంత్ లాంటి నాయకుడికి పీసీసీ చీఫ్ ఇవ్వడంతో తిరుగుబావుటా ఎగురేశారు. కేసుల్లో ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఎలా ఇస్తారని ప్రశ్నించే వరకు ఆయన వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబానికి సాయం చేస్తే… అంతకు మించి పార్టీ కోసం త్యాగాలు చేశామని కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురేయడంతోపాటు, తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకిస్తున్న రాజగోపాల్ రెడ్డి తన ఉనికి చాటుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మొత్తం వ్యవహారం హీటెక్కింది. ఉపఎన్నిక ఖాళీ నోటిఫికేషన్ వెలువడటం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయ్.

తన దారి తాను చుసుకోవడం వరకు బాగానే ఉన్నా.. సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయంగా ఎలా అడుగులు వేయాలో అర్థం కాక చిక్కుల్లో పడ్డారు. పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడ్డ ఆయన… పార్టీలో తనకు తగిన గౌరవం లేకుండా పోతోందని చాలా సార్లు బాహాటంగా వ్యాఖ్యానించారు. కానీ ఆయన స్వతహాగా రాజగోపాల్ రెడ్డి తరహా దూకుడు తత్వం ఉన్న వ్యక్తి కాకపోవడంతో పెద్దగా పార్టీకి కలిగే డామేజ్ ఏమీ ఉండదని హస్తం నేతలు లెక్కలు వేసుకున్నారు. కానీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు ఇస్తున్న రిపోర్టులతో వెంకట్ రెడ్డి గుస్సాగా ఉన్నట్టు కన్పిస్తోంది. ఢిల్లీ పెద్దలకు తన గురించి ఉన్నదీ, లేదని చెప్తున్నారని… అందుకే హైకమాండ్ లైట్ తీసుకుంటుందన్న అభిప్రాయానికి ఆయన వచ్చారు.

అందుకే తన ఎంపీ నియోజకవర్గపరిధిలో తమ్ముడు మరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుంటే… ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి వచ్చేశాడు. ఓవైపు పార్టీలో కీలకనేతగా గుర్తింపు పొంది ఇప్పుడు పార్టీని వదిలేయాల్సిన దుస్థితిని సొంత పార్టీ నేతలే తీసుకొచ్చారన్న ఆవేదనలో వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగని పార్టీని వదిలేయలేడు. ఉండలేడు. తమ్ముడిబాటలోనూ పయనించలేడు. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ తీరుపైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడు ప్రచారానికి వెంకట్ రెడ్డి రాకున్నా ప్రాబ్లమ్ లేదని వ్యాఖ్యానించడమంటే… తాను పార్టీలో లేకున్నా ఇబ్బంది లేదన్న సంకేతాలిచ్చారా అని ఆయన తలలుపట్టుకుంటున్నారు.