తొలిఏకాదశి పేరెలా వచ్చింది? ఈరోజు ఏం చేయాలి?
నేడు (జూలై 17) తొలి ఏకాదశి. హిందువులకు పవిత్రమైన, శుభప్రదమైన తిథి తొలి ఏకాదశి. ప్రతీ నెలకూ రెండు ఏకాదశులు వచ్చినా, తొలి ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత చాలా గొప్పది. ఈ పేరు ఎలా వచ్చింది? ఈ రోజు ఏం చేయాలి? ఏ దేవుడిని పూజించాలి? అనేది తెలుసుకుందాం. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మురాసురుడనే రాక్షసుని సంహారం కోసం విష్ణువు శరీరం నుండి ఏకాదశి అనే కన్య ఉద్భవించింది. ఆమె ఆ రాక్షసుని సంహరించడంతో సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశిగా నామకరణం చేసి, తిథులలో భాగంగా చేశారని, విష్ణువుకు ప్రియమైన తిథిగా ఆశీర్వదించారని నమ్మకం.

వానాకాలం ప్రారంభంలో వచ్చే ఈ తొలి ఏకాదశి నుండి వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. వర్షాల కారణంగా అంటురోగాలు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ రోజున కఠిన ఉపవాస నియమాలు పాటిస్తారు. ఉపవాసదీక్షలకు ఈ రోజే మొదలు. ఈ రోజున శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారని, అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. రోజంతా ఉపవాసం చేసి, రాత్రి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువు ధ్యానంలో గడిపి ద్వాదశి రోజు దానధర్మాలతో ఈ ఉపవాస దీక్షను విరమించాలి. అలా చేస్తే జన్మజన్మల పాపాలు పరిహారమవుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు నుండి చాతుర్మాస దీక్ష మొదలు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశిన విష్ణువు మేల్కొంటారని, అందుకే ఈ నాలుగు నెలలు చాతుర్మాసమని అంటారు. ఈ ఉపవాసాల వల్ల జీర్ణకోశంలో సమస్యలు తొలగి, నూతన శక్తి వస్తుంది. లంఖనం పరమౌషదం అన్నట్లు ఉపవాసం వల్ల శరీరం దానిలోని రుగ్మతలను అదే తగ్గించుకుంటుంది.

