కొడుకు బీజేపీలో చేరడంపై ఏకే ఆంటోనీ ఏమన్నారంటే..!
తనయుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై వేదన, నిరాశను వ్యక్తం చేశారు మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ. ఇది “తప్పు నిర్ణయం”, “చాలా బాధాకరమైన” క్షణం అని పేర్కొన్నారు. దేశాన్ని విభజించేందుకు, ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని.. అలాంటి భావజాలానికి తాను ఎన్నటికీ మద్దతు ఇవ్వబోనని ఆంటోనీ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ “మత, విభజన ఎజెండా” కు వ్యతిరేకంగా తాను పోరాడానని… “ఆఖరి శ్వాస వరకు” దానిని కొనసాగిస్తానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానని, భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత తమదేనన్నారు. రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొందానని, విధానపరమైన విషయంలో ఒక్కసారి మాత్రమే ఆమెతో విభేదించానని, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి ఆమెను మరింత గౌరవించానని చెప్పారు.

“నేను నా రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నాను. నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. కానీ నేను ఉన్నంత కాలం కాంగ్రెస్ కోసం బతుకుతాను” అని ఆంటోనీ అన్నారు. కుమారుడు పార్టీ మార్పుపై అంతకంటే ఇక తానేం మాట్లాడబోనన్నారు. మీడియా తన ప్రైవసీని గౌరవించాలన్నారు ఆంటోనీ. కాంగ్రెస్ వివిధ సామాజిక కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలతో సంబంధం కలిగి ఉన్న అనిల్ ఆంటోనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల నాయకత్వానికి తాను ఆకర్షితుడయ్యానని.. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమంటరీ భారతదేశంపై పక్షపాతంతో కూడుకున్నదని వ్యాఖ్యలు చేసి, కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి అనిల్ గురయ్యాడు.

