హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఏందీ ఇదంతా..
హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త పదం పెట్టారు.. అసలు ఇలాంటి పదాలు రాజ్యాంగం ఒప్పుకుంటదా అధ్యక్షా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హిందూ బీసీ, ముస్లిం బీసీ అని వాడారని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా పిటిషన్ వేస్తే వారం రోజుల్లోనే కులగణనను కొట్టేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా సంఖ్యకు సర్వేలోని గణాంకాలకు పొంతన లేదని పాయల్ శంకర్ విమర్శించారు. ప్రభుత్వ వెబ్ సైట్ ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు అయితే సర్వే ప్రకారం మాత్రం రాష్ట్ర జనాభా 3.76 కోట్లు మాత్రమే ఉందన్నారు. వెనుకబడిన వర్గాల్లోని చాలా కుటుంబాల్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారని, కానీ గడిచిన 14 ఏళ్లుగా బీసీల జనాభా తగ్గిపోయిందని, అంటే వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో పిల్లలు పుట్టలేదా..? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తున్నారని, వారి ఓట్లు పొందేందుకు మాత్రమే బీసీల నినాదం ఎత్తుకుంటున్నారని ఆరోపించారు.

