Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలేవి?

అమరావతి:రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివని, అయితే గత ప్రభుత్వ హయాంలో రైతులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న వేధింపుల పట్ల బాధ్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం సరికాదని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. మందడం గ్రామంలో ఆదివారం జరిగిన రైతు సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్ల కాలంలో అమరావతి ఉద్యమ సమయంలో మహిళలు ఎన్నో అవమానాలను, శారీరక వేధింపులను అనుభవించారని ఏబీ వెంకటేశ్వర రావు గుర్తు చేశారు. “మహిళలపై దాడులు జరిగినప్పుడు యావత్ రాష్ట్రం స్పందించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా, ఆనాడు మహిళలపై దాడులకు తెగబడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?,” అని ఆయన ప్రశ్నించారు. బాధ్యులను శిక్షించినప్పుడే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం చేపట్టబోయే రెండో విడత భూసేకరణపై ఆయన రైతులకు అత్యంత కీలకమైన సూచనలు చేశారు. భూములు ఇచ్చే ముందు ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీలు, నిబంధనలను రైతులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కోరారు. ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన మరియు భవిష్యత్తులో అందే ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో రాతపూర్వక స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. రాజధాని అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, ఇది ఐదు కోట్ల ప్రజల ఆశ అని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధి ఫలాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగా అందాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో మందడం గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, తమకు రావాల్సిన బకాయిలను ఏబీ వెంకటేశ్వర రావు దృష్టికి తీసుకువచ్చారు. ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఏబీ, రైతుల పక్షాన నిలబడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.