త్వరలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం : పవన్ కళ్యాణ్
ఏపీలో రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికే ఎన్డీఏతో కలిసి ముందుకు సాగుతున్నామని భవిష్యత్తులో ఏ ఏ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నది వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తులకు సంబంధించి దశలవారీగా చర్చలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరోసారి రాకుండా తమ వంతు అన్ని ప్రయత్నాలు సాగిస్తామన్నారు.

ఇందుకోసం ముందుకు వచ్చే పార్టీలను కలుపుకు వెళ్ళటమే తమ ప్రధాన లక్షణం అన్నారు. మూడో విడత వారాహి యాత్రను విజయవంతం చేసిన వారందరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు అంశాలకు సంబంధించి విపులంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పాటు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే తప్పని పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమేనన్నారు.


