Andhra PradeshHome Page Slider

జనసేన, బీజేపీది విడిపోయే బంధం కాదన్న ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు

ఏపీలో వైఎస్ఆర్సిపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే వరకు జనసేన పార్టీతో కలిసి పోరాడతామని ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఇప్పుడు తమ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ లను పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారంటే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లే కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో జనసేన, బీజేపీల మధ్య పొత్తుపై స్పందించారు. రానున్న రోజుల్లో కలిసే ముందుకు సాగుతూ ప్రభుత్వంపై పోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా తాము కలిసే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ అవసరాల కోసం వివిధ పార్టీల నేతలను కలవడం సహజమన్నారు. గతంలో తాను చంద్రబాబు నాయుడుని కలిసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నట్లా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం కలిసామని చెప్పారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉండొచ్చని తెలిపారు. జనసేనతో తమది బలమైన బంధం అంటూ తమ పార్టీ పెద్దలను కలిసి మాట్లాడటమే ఇందుకు నిదర్శనం అన్నారు. రానున్న రోజుల్లో తమ ఇరు పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పోరాడతామని ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు.