రాజన్న ఆలయానికి పూర్వవైభవం తెస్తాం
గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పూర్తిగా పట్టించుకోలేదని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఆలయ అభివృద్ధి కుంటుపడిందని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆలయానికి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క-సారక్క మరియు వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధికి ఏకకాలంలో నిధులు కేటాయించి, ఆధ్యాత్మిక క్షేత్రాల పట్ల తమకున్న భక్తిని, చిత్తశుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు
గతంలో రాజన్నను దర్శించుకుంటే పదవులు పోతాయని లేదా నష్టం జరుగుతుందంటూ కొన్ని దుష్ట శక్తులు అపోహలను, దుష్ప్రచారాలను చేశాయని మంత్రి మండిపడ్డారు. అలాంటి నమ్మకాలను పక్కన పెట్టి, భక్తులు రాజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా కొలుస్తారని ఆమె అన్నారు. రాజన్నపై ఉన్న అచంచలమైన నమ్మకంతోనే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారని, భక్తుల సౌకర్యార్థం వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ వంటి కీలక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ఎన్నికలకు ముందు తాము మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించి, వేములవాడ రాజన్నను దర్శించుకున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమ్మక్క-సారలమ్మ చరిత్రను, వారి ప్రత్యేకతను భవిష్యత్ తరాలకు తెలిసేలా శిలలపై చెక్కిస్తున్నామని, అదే రీతిలో వేములవాడ క్షేత్రాన్ని కూడా అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారితో కలిసి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి సీతక్క వివరించారు.

