జిల్లాల జోలికొస్తే ఊరుకోం
రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పరిచిన జిల్లాల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా అస్తిత్వానికి భంగం కలిగిస్తే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అని ధ్వజమెత్తారు. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ చేసిన జిల్లాల విభజనను మార్చాలని చూడటం దుర్మార్గమని, తెలంగాణ గడ్డపై కేసీఆర్ వేసిన ముద్రను చెరిపేయడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలను కుదిస్తాం లేదా మారుస్తాం అంటూ ప్రభుత్వం చేస్తున్న బాధ్యతారాహిత్య ప్రకటనలు ప్రజల్లో గందరగోళం సృష్టించి, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని మధుసూదనాచారి మండిపడ్డారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం, ఉన్న వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం సరికాదన్నారు. చేతనైతే ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు సాగు సాయాన్ని పెంచి అందించాలని, సాకులు వెతుకుతూ కాలయాపన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మరియు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

