Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

హైదరాబాద్ ఉనికిని దెబ్బతీస్తే ఊరుకోం

హైదరాబాద్ మహానగరాన్ని ఎటువంటి సాంకేతిక అధ్యయనం లేకుండా, ఇష్టమొచ్చినట్లు విభజిస్తూ ప్రభుత్వం చారిత్రక జంట నగరాల ఉనికిని నాశనం చేస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

24 నియోజకవర్గాలున్న హైదరాబాద్‌ను విభజించే ముందు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకపోవడం దురదృష్టకరమని తలసాని అన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా, కేవలం గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా డివిజన్లను నిర్ణయించినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌కు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయని, ఆ ఉనికిని చెరిపివేయాలని చూస్తే సహించేది లేదని, సికింద్రాబాద్ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై తలసాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను, స్పీకర్లను చూశాను. కానీ ఇలాంటి తీరును ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో గంటన్నర పాటు బూతు పురాణం చదువుతుంటే స్పీకర్ కనీసం అడ్డుచెప్పకపోవడం విడ్డూరంగా ఉంది” అని విమర్శించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూపించాలని తలసాని సవాల్ విసిరారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే, సభలో తమ గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు నగరమంతా తిరగాల్సి వస్తోందని, పరిపాలన సౌలభ్యం కోసం తాము గతంలో చేసిన 150 డివిజన్ల వ్యవస్థనే ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.