Andhra PradeshNews

దక్షిణ భారతదేశంలోనే పెద్ద షిరిడీ సాయి ఆలయం మన తిరుపతిలో

Share with

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శ్రీ సమర్థసద్గురు షిరిడీ సాయినాధుని ఆలయం తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సముదాయంలో నూతనంగా నిర్మింపబడింది. ఈ దేవాలయంలో నిన్న గురువారం సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన, విమాన కలశస్థాపనను రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతి, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, పద్మావతి, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్, సినీ దర్శకులు బి. గోపాల్, కోదండరామిరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, ముక్కామల శ్రీధర్‌స్వామి, షిరిడి నుండి వచ్చిన రుత్వికులు, వేదపండితులు, విద్యానికేతన్ ఛాన్సలర్ శ్రీ మంచు మోహన్‌బాబు, వారి  కుటుంబసభ్యులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా ఉదయం యాగశాలలో గణపతిపూజ, యజ్ఞాలు, హోమాలు నిర్వహించారు. మోహన్ బాబు స్వామివారికి దివ్యాభరణాలు, ప్రత్యేక పూజా సామాగ్రి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ దైవానుగ్రహంతో తన ఇన్నేళ్లకల ఫలించిందని, సాయినాధుని దేవాలయం నిర్మించడం బాబా కృపతోనే సాధ్యమయిందన్నారు. తిరుమల వచ్చిన భక్తులందరూ సాయినాధుని కూడా దర్శించుకోవాలని కోరారు. పలువురు దాతలు సహాయం చేసారని, ధ్యానమందిరం కూడా నిర్మించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ సుశీల్ కుమార్ శిండే దంపతులు హాజరై మోహన్ బాబు దంపతులకు పట్టు వస్త్రాలు అందించారు.