Breaking Newshome page sliderHome Page Slider

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ భేటీలో రచ్చ

హైదరాబాద్ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. నగరంలోని డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రూపొందించిన డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టగా, దీనిపై ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు ఒక్కసారిగా నిరసనకు దిగారు. జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన కొత్త మ్యాప్‌లు తప్పులతడకగా ఉన్నాయని, శాస్త్రీయత లేకుండా డివిజన్ల పునర్విభజన చేశారని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు గెజిట్‌ పత్రాలను చించివేసి ఆందోళన చేపట్టారు. “డివిజన్‌ చోరీ” జరిగిందంటూ నినాదాలు చేస్తూ మేయర్ పోడియంను చుట్టుముట్టడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ పరిణామాలపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనల మధ్యే సభను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు సభ్యులు డీలిమిటేషన్‌ ప్రక్రియపై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వార్డుల విభజనలో భౌగోళిక సరిహద్దులు, జనాభా లెక్కల విషయంలో ఉన్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు సూచించారు. తర్వాత మేయర్ మాట్లాడుతూ.. డివిజన్ల పునర్విభజనపై కార్పొరేటర్లు వ్యక్తం చేసిన అన్ని అభ్యంతరాలను, సలహాలను క్రోడీకరించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు.