Home Page SliderNational

బంగ్లాదేశ్‌లో రాజుకుంటున్న అగ్గి నిన్న హసీనా, నేడు చీఫ్ జస్టిస్ !?

వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం నిరసనల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థ అధిపతి పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్, నిరసనకారుల ఒత్తిడితో రాజీనామాకు అంగీకరించినట్లు బ్రాడ్‌కాస్టర్ జమున టివి నివేదించింది. 65 ఏళ్ల న్యాయమూర్తి సాయంత్రం అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌ను సంప్రదించి రాజీనామాను సమర్పించనున్నారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. హసన్ సుప్రీంకోర్టులోని రెండు విభాగాలకు చెందిన న్యాయమూర్తులందరితో ఫుల్ కోర్ట్ సమావేశానికి పిలుపునిచ్చిన తర్వాత నిరసనలు ప్రారంభమయ్యాయి. ఫుల్‌కోర్టు సమావేశాన్ని నిరసన తెలిపిన విద్యార్థులు న్యాయవ్యవస్థ తిరుగుబాటుగా భావించి హైకోర్టు ఆవరణను ముట్టడిస్తామని ప్రకటించారు. విద్యార్థుల నిరసన నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ హసన్‌ సమావేశాన్ని వాయిదా వేసి ఆ తర్వాత పదవి నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించారు.

పదవీచ్యుతుడైన ప్రధాని షేక్ హసీనాకు విధేయుడిగా గత ఏడాది నియమించిన హసన్‌ రాజీనామా చేయాల్సిందిగా గంట టైమ్ ఇచ్చారు. బంగ్లా అల్లర్లలో డజన్ల కొద్దీ పోలీసు అధికారులతో సహా 450 మందికి పైగా మరణించారు. పోలీసు యూనియన్ సమ్మెను ప్రకటించింది. వారి భద్రతకు హామీ ఇచ్చే వరకు తిరిగి విధుల్లోకి రావడానికి నిరాకరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. హసీనా సోమవారం నుంచి న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశానికి తిరిగి వచ్చి ఎన్నికలలో పాల్గొనాలని యోచిస్తున్నారు. హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇళ్లపై దాడులు చేసి, ఆస్తులను దోచుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో వేలాది మంది పౌరులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ముహమ్మద్ యూనస్ ‌ను సైన్యం నియమించింది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారాలపాటు జరిగిన ఘోరమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల తరువాత దేశాన్ని తాత్కాలికంగా యూనస్ నడిపిస్తున్నారు.