మస్క్ చేతికి ట్విట్టర్.. భారతీయులపై వేటు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కింది. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను హస్తగతం చేసుకోగానే కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులపై మస్క్ వేటు వేశారు. ఈ నెల 28వ తేదీలోపు ఏదో నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు ఆదేశం నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా అయిన ట్విట్టర్ డీల్‌ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కుదుర్చుకున్నారు. వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గెట్‌లను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌బీసీ వార్తా సంస్థలు తెలిపాయి.

పక్షికి స్వేచ్ఛ లభించింది..
‘పక్షికి స్వేచ్ఛ లభించింది’ అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే.. ట్విట్టర్‌కు మస్క్ చెల్లించిన 44 బిలియన్ డాలర్లు (3.62 లక్షల కోట్ల రూపాయలకు పైనే) ఎక్కువ మొత్తం అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాను ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నా.. ట్విట్టర్‌కు అమూల్యమైన సత్తా ఉందని మస్క్ చెప్పారు. జనవరి నుంచి ట్విట్టర్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన మస్క్ షేర్లు మార్చి నెలలో 5 శాతానికి చేరుకున్నాయి. ఏప్రిల్ నాటికి ట్విట్టర్‌లో మస్క్ అతి పెద్ద వాటాదారుగా ప్రపంచానికి తెలిసింది. ఆ నెల చివరి నాటికే 4,400 కోట్ల డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ ముందుకొచ్చారు. ట్విట్టర్ నుంచి ఫేక్ అకౌంట్లను తొలగించి వాక్ స్వాతంత్య్రానికి వేదికగా మారుస్తానని ప్రకటించారు.

ఫేక్ అకౌంట్లపై రగడ..
అయితే.. ఫేక్ అకౌంట్లు ట్విట్టర్ చెప్పిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయంటూ ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు మస్క్ నిరాకరించారు. కానీ.. ట్విట్టర్‌ను కొనేందుకు చట్టబద్ధంగా ఒప్పందం చేసుకున్న మస్క్ దానికి కట్టుబడి ఉండాలంటూ ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కొనుగోలుపై అక్టోబరు 28వ తేదీలోగా నిర్ణయం ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఫలితంగా ప్లాన్ మార్చుకున్న మస్క్ ట్విట్టర్‌ను కొనేందుకే నిర్ణయించుకున్నారు. దీంతో ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నలుగురు పెద్ద తలకాయలపై వేటు వేశారు. అయితే.. తాను 75 శాతం ఉద్యోగులను తొలగిస్తానంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని మస్క్ చెప్పారు. ఉద్యోగుల పని విధానంలో మాత్రం భారీగా మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో 7,500 మంది పని చేస్తున్నారు.

