NationalNews

రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు

Share with

2022 రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు బలపర్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్. యశ్వంత్ నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్… యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారని.. కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ సభ్యులతో యశ్వంత్ సిన్హా నామినేషన్ ప్రక్రియలో భాగస్వామి కాబోతున్నట్టు తెలిపారు. నామినేషన్ డెడ్‌లైన్‌కు మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. ఢిల్లీలో మమత బెనర్జీ నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవడంతో… ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ రేగింది.

కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినప్పుడు తాము సమావేశానికి హాజరుకాబోమన్న వర్షన్ టీఆర్ఎస్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉండే కూటమిలో ఉండే ఆలోచన టీఆర్ఎస్‌కు లేదన్న అభిప్రాయాన్ని ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ టీఆర్ఎస్ కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితమే యశ్వంత్ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు. అంతకు ముందు ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ పేర్లు ప్రతిపాదించిన వారిద్దరూ పోటీకి దూరంగా ఉండటంతో రంగంలోకి యశ్వంత్ సిన్హాను పేరు మమత బెనర్జీ తెరపైకి తీసుకొచ్చారు.

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో అధికార పార్టీకి 49 శాతం ఓట్లుండగా… విపక్షాలకు 50 శాతానికి పైగా ఓట్లున్నాయ్. కానీ ఇప్పటికే బీజేడీ, వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపర్చిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయ్. దీంతో ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం ఖాయంలా కన్పిస్తోంది. ఇప్పటి వరకు ఎన్డీఏ అభ్యర్థికి 55 శాతానికి పైగా ఓట్లు లభించేలా ఉండగా… మాయవతి లాంటి నేతలు సైతం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి జైకొడుతున్నారు.