టీఆర్ఎస్.. ఆరిపోతున్న దీపం
మునుగోడు ఎన్నిక తర్వాత రాజకీయ ప్రళయం
బీజేపీతో టచ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రెండు లాభాలు
బీజేపీని గెలిపిద్దాం.. కేసీఆర్ ఓటమికి బాట వేద్దాం
చౌటుప్పల్‌లో టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ ఫైర్
మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడి ప్రజలకు రెండు లాభాలు జరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ తెలిపారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్ ఇచ్చారని.. గిరిజన బంధు ఇస్తున్నారని.. రోడ్లు వేస్తున్నారని.. గుళ్లకు, కమ్యూనిటీ హాల్‌కు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. మత్స్యకార సంఘాల ప్రతినిధులు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యజమాని కేసీఆర్ కాదు.. మనమే..
టీఆర్ఎస్ నాయకులు ఎన్ని గుళ్లు కట్టించినా.. ఎన్ని రోడ్లు వేయించినా.. ఎన్ని డబ్బులు పంచినా.. అన్నీ తీసుకోవాలని.. ఓటు మాత్రం బీజేపీ అభ్యర్థికే వేయాలని ప్రజలను ఈటల కోరారు. కేసీఆర్ తన ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని.. ఆ డబ్బులన్నీ ప్రజలవేనని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్.. మద్యంపై రూ.42 వేల కోట్లు దండుకుంటున్నారని.. అంటే యజమాని కేసీఆర్ కాదని.. మనమే యజమానులమని స్పష్టం చేశారు.

నిధులివ్వక పోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి రాజీనామా..
ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాల్లో కేసీఆర్ నిధులు ఇవ్వకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని.. అభివృద్ధి కావాలంటే పార్టీ మారాలని ఈటల స్పష్టం చేశారు. కేసీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ మద్దతివ్వలేదని.. కేసీఆర్‌ను ఓడించే సత్తా ఆ పార్టీకి లేదని తేలడం వల్లే ఆయన బీజేపీలో చేరారని వివరణ ఇచ్చారు. ఉప ఎన్నిక వస్తేనే నియోజక వర్గంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

కేసీఆర్ అహంకారం పోవాలంటే బీజేపీని గెలిపించాలి..
మిషన్ భగీరథ నీళ్లు మినరల్ వాటర్ కంటే గొప్పగా ఉంటాయన్న కేసీఆర్ నాచు నీళ్లు తాగిస్తున్నాడు.. పైలాన్ వేసిన చౌటుప్పల్లోనే మంచి నీళ్లకు దిక్కు లేదని ఈటల విమర్శించారు. హుజూరాబాద్‌లో చేసినట్లే.. మునుగోడులోనూ ఇంటింటికీ ఇంటెలిజెన్స్ వారిని దింపి కౌన్సెలింగ్ చేస్తున్నారని.. వేరే పార్టీల్లోకి వెళ్లే వారి దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని వాపోయారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్.. పార్టీ మారకుండానే మంత్రులను చేసి నీచానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారం పోవాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కమలం గుర్తుపై ఓటేస్తేనే దురహంకార, దుర్మార్గ పాలన పోతుందని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ఆరిపోతున్న దీపం.. ప్రజల చేత ఛీ కొట్టించుకున్న పార్టీ అని ఈటల ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణాలో రాజకీయ ప్రళయం వస్తుందని జోస్యం చెప్పారు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగు కాక తప్పదన్నారు.