శివసైనికుడు సంజయ్ రౌత్ తగ్గరన్న ఉద్ధవ్ థాక్రే
పత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో శివసేన రాజ్యసభ ఎంపీని ఈడీ అరెస్టు చేసింది. నాలుగుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన ఒక్కసారే హాజరయ్యారని… సాక్షులను ప్రభావితం చేయాలని చూశారని ఈడీ కోర్టులో వాదించింది. సంజయ్ తరపు న్యాయవాది అశోక్ ముండార్గి ఈ అరెస్టును రాజకీయ కుట్రగా వాదించి, ఆయనకు గుండె సమస్య ఉందనీ, సర్జరీ కూడా జరిగిందని ఆధారాలు చూపడంతో చివరికి 4 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో, సంజయ్ సన్నిహితంగా ఉండేవారు. పార్టీ కార్యకలాపాలన్నింటినీ తానే పర్యవేక్షించేవారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు దీటుగా జవాబిచ్చేవారు. ఈ కారణంగా ఉద్దవ్ థాక్రే సంజయ్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈసందర్భంలో బీజేపీ పాలనను రెండో ప్రపంచ యుద్దకాలంలో నియంత హిట్లర్ పాలనతో పోల్చాడు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ లను వాడుకుంటోందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని మండిపడ్డారు.
సంజయ్ రౌత్ పట్ల గర్వంగా ఉందనీ, ఆయన ఎలాంటి ఒత్తిడికి తలవంచరని, ఆయన నిజాయితీ గల శివసైనికుడని, మంచి పాత్రికేయుడని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే అనే డైలాగ్‌ను గుర్తుచేసారు. అలాగే తమ శివసైనికుడు సంజయ్ రౌత్ కూడా ఎక్కడా తగ్గేదేలే అని కొనియాడారు. సంజయ్ భార్యాబిడ్డలను, తల్లిని ఉద్ధవ్ థాక్రే ఓదార్చారు.