NationalNewsNews Alert

అరుదైన నేతకు ఘన నివాళులు

Share with


సేవా నిరతికి ఆయన నిలువెత్తు సాక్ష్యం. నీతి నిజాయితీకి నిజమైన చిరునామా. విలక్షణమైన వ్యక్తిత్వం.. నిండైన దేశభక్తి పరాయణం. పార్టీలు ఏవైనా.. సిద్ధాంతాలు వేరైనా అందరూ అభిమానించే నేత ఆయన. దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన నిస్వార్ధ రాజకీయ నాయకుడు. భారతీయుల మనసులు గెలిచుకున్న నేత. అటల్ బిహారీ వాజ్ పేయి గతించి అప్పుడే నాలుగేళ్ళు గడిచి పోయాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో 1924 డిసెంబర్ 25న వాజ్ పేయి జన్మించారు. భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. అన్ని పార్టీల నేతలను ఆప్యాయంగా పలకరించే వారు. నిజాన్ని నిర్భీతితో ఎలుగెత్తి చాటే వారు. తప్పుంటే ఎంతటి వారినైనా కడిగి ఆరేసేవారు. ఆయన నిర్ణయాలతో దేశంలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రధానిగా ఆయన తీసుకున్న కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు అంతర్జాతీయంగా దేశ కీర్తి ప్రతిష్టలను పెంచాయి.

వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా యావత్ భారత దేశం ఇవాళ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. అరుదైన రాజకీయ నేతగా ఆయనను కొనియాడుతోంది. ఢిల్లీలోని వాజ్ పేయి స్మారక స్ధలం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలతో పాటు వాజ్ పేయి దత్తత కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య ఘన నివాళులు అర్పించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను ప్రశంసించారు.