పెద్దపల్లిలో ఘోరం.. రైలు ఢీకొని రైల్వే కార్మికుల దుర్మరణం
పెద్దపల్లి మండలంలో ఘోరం జరిగింది. రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేస్తున్న కూలీలపై నుంచి 130 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు కూలీల మాంసం ముద్దలు కిలోమీటరు దూరం వరకు చెల్లాచెదురయ్యాయి. పెద్దపల్లి మండలం కొత్తపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని హుస్సేన్‌మియా వాగు వంతెన వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి నుంచి కాజీపేట వైపు గూడ్స్ రైలు వెళ్తుండగా.. ఆ ట్రాక్‌పై పని చేస్తున్న కూలీలు మరో ట్రాక్‌పైకి వెళ్లారు. అదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి కూడా ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది.

గూడ్స్ రైలు శబ్ధం కలిసిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు శబ్ధం..
అయితే.. గూడ్స్ రైలు శబ్ధంలో ఎక్స్‌ప్రెస్ రైలు శబ్ధం కలిసిపోవడంతో కూలీలు ఆ ట్రాక్‌పై నుంచి కదలలేదు. ఊదరి శ్రీనివాస్ అనే కూలీ మాత్రం చివరి నిమిషంలో రైలును చూసి ట్రాక్ బయటికి పరిగెత్తాడు. మిగిలిన వారిని అప్రమత్తం చేసేలోపే అతి వేగంగా వచ్చిన రైలు కాంపల్లి వేణుకుమార్, పెగడ శ్రీనివాస్, కత్తుల దుర్గయ్యలను తునాతునకలు చేసింది. కూలీల శరీర భాగాలు ప్రమాదం జరిగిన స్థలం నుంచి కిలోమీటరు దూరం వరకూ మాంసం ముద్దలుగా చెల్లాచెదురవడం స్థానికులను కలిచివేసింది.

ఆలస్యంగా వచ్చిన రైల్వే పోలీసలు..
ఘటనా స్థలంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్థానిక పోలీసులు త్వరగానే వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం మూడున్నరకు ప్రమాదం జరిగితే రైల్వే పోలీసులు మాత్రం రాత్రి ఎనిమిదిన్న గంటల వరకూ రాకపోవడం దారుణమని మృతుల బంధువులు ఆవేదన వెలిబుచ్చారు. మృతుల శరీర భాగాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు.

