ఐటీ కంపెనీలకు గడ్డు కాలమే..!
అమెరికా ఆర్థిక మాంద్యం ఊబిలోకి కూరుకుపోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికానే కాదు.. చైనా, బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట ఉన్నాయి. ఆయా దేశాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. రానున్న 6-12 నెలల్లో మహా మాంద్యం తప్పదని అంటున్నారు. ఈ మాంద్యం ప్రభావం 3-4 ఏళ్ల పాటు ఉండే అవకాశాలున్నాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్, భారత్ సహా పలు దేశాలు వడ్డీ రేట్లను పెంచడమే ఆయా దేశాల్లో ఆర్థిక క్లిష్ట పరిస్థితికి ప్రధాన కారణమంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యానికి మరో కారణంగా చెబుతున్నారు.

భారీగా ఉద్యోగాల తొలగింపు..
ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావం తొలుత ఐటీ కంపెనీలనే దెబ్బ తీయనుంది. కరోనా మహమ్మారి కాలంలో ఇతర రంగాలు కుదేలైనా.. ఐటీ రంగం మాత్రం మరింత బలోపేతమైంది. ఇప్పుడు మాంద్యం దెబ్బకు పరిస్థితి తారుమారైంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి అమెరికాలోని దిగ్గజ కంపెనీలు మూడో త్రైమాసికంలో పేలవమైన ఆర్థిక ఫలితాలు సాధించాయి. వీటి షేర్లు కూడా పడిపోవడంతో ఐటీ కంపెనీలన్నీ కలిసి దాదాపు 50 శాతం ఉద్యోగాలపై కోత విధించే పనిలో పడ్డాయి. 46 శాతం మంది ఉద్యోగులకు బోనస్‌లు తగ్గిస్తూ 44 శాతం మందికి ఆఫర్లను రద్దు చేస్తున్నారు. అక్టోబరు నెల చివరి నాటికే అమెరికాలోని టెక్ కంపెనీలు ఏకంగా 45 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.

భారత్‌లోనూ నియామకాల నిలిపివేత..
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మాతృక సంస్థ మెటా 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఆదాయం తగ్గడం, టెక్ పరిశ్రమ కష్టాల్లో ఉండటంతో 13 శాతం ఉద్యోగాలపై కోత విధించినట్లు మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. 2004లో ప్రారంభమైనప్పటి నుంచి ఫేస్‌బుక్ ఇంతటి భారీ నష్టాలను తొలిసారి చూసిందని చెప్పారు. ట్విటర్‌లో ఎలాన్ మస్క్ 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. అందులో 90 శాతం మంది భారతీయ ఉద్యోగులపై వేటు పడింది. డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్ జెమినీ, అసెంచర్, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, ఎంఫసిస్ వంటి టెక్ కంపెనీలు కొత్త ఉద్యోగాల నియామకాలను నిలిపివేశాయి. ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను సైతం వెనక్కి తీసుకుంటున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో 25-30 శాతం తగ్గించాయి.

55-65 శాతం ఖర్చు ఉద్యోగులకే..
భారత్‌లోని 10 అతిపెద్ద ఐటీ కంపెనీల్లో సెప్టెంబరు 30వ తేదీ నాటికి 17.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా నుంచి ప్రాజెక్టులు అందకుంటే అందులో 30 శాతం వరకు ఉద్యోగులు ఇంటికి పోవాల్సి వస్తుందని ఐటీ కంపెనీల అధినేతలు అంటున్నారు. ఐటీ కంపెనీల ఖర్చులో 55-65 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే అవుతోంది. ఆదాయం తగ్గినా.. నష్టాలు వచ్చినా వాటిని పూడ్చుకోవాలంటే ఉద్యోగులపై వేటు వేయక తప్పదని అంటున్నారు. మొత్తానికి ఐటీ రంగానికి ఇది గడ్డు కాలమే అంటున్నారు.