ఏపీలో మొత్తం ఓటర్లు 4.08 కోట్లు
అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా తర్వాత ఏపీలో మొత్తం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీన. ఏపీలో 5 లక్షల మేర యువ ఓటర్లు పెరిగారని చెప్పారు. రేపటి నుంచి కాలేజీలు యునివర్సిటీ ల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రయత్నిస్తామన్నారు. ఏపీలో జీరో, జంక్ ఓటర్లు ఉన్నారని… వాటిని 98 శాతం మేర సరి చేశామన్నారు. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో సవరణ చేయలేకపోయామన్నారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్ళను తనిఖీ చేశామన్నారు. ఇంకా 2 శాతం మేర సరిదిద్దాల్సి ఉందన్నారు. జీరో, జంక్ ఓటర్ల సంఖ్య గతంలోనూ ఉందన్నారు సీఈవో.

14 లక్షల ఓటర్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయన్నారు. 5.6 లక్షల ఓటర్ లు అర్హులు కారని గుర్తించి తొలగించామమన్నారు. దురుద్దేశం పూర్వకంగా ఫార్మ్ 6, ఫార్మ్ 7 ల పై దాఖలు చేసిన వారిపై 70 కేసులు పెట్టామన్నారు. ఈ అంశాలపై నివేదికకోరామన్నారు. కొత్త దరఖాస్తుల పై కూడా సమీక్ష చేస్తామన్నారు. 80 ఏళ్ళు పై బడిన వారికి ఇంటికి వెళ్ళి ఓటు నమోదు చేయించాలని నిర్ణయించామన్నారు. అలాంటి ఓటర్లు మొత్తం 4.70 లక్షల మంది ఉన్నారన్నారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు అభ్యంతరాల పై సీఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. తుది జాబితాను అన్ని పంచాయితీ కార్యాలయాల్లోను అందుబాటులో ఉంచుతామన్నారు.

